Pujara: గాయం వేధిస్తున్నా పెయిన్‌ కిల్లర్‌ తీసుకుని మరీ ఆడాడు..

5 Sep, 2021 12:35 IST|Sakshi

ఓవల్‌: గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతూ వస్తున్న టీమిండియా నయా వాల్‌ పుజారా ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నట్లు కనపిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో సెంచరీకి చేరువగా వెళ్లిన పుజారా.. ప్రస్తుతం జరుగుతున్న ఓవల్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన అర్ధసెంచరీ(61) సాధించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, తాజా ఇన్నింగ్స్‌ సందర్భంగా పుజారా కాలి మడమ గాయంతో బాధపడ్డాడు. వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో అతని మడమ మడత పడటంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. దీంతో మధ్యమధ్యలో పెయిన్ కిల్లర్‌ను తీసుకుంటూ మరీ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. టీమిండియా పటిష్ట స్థితికి చేరిన అనంతరం రాబిన్సన్ బౌలింగ్‌లో మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇదే ఓవర్‌లో భారత్‌ రోహిత్‌ వికెట్‌ను కూడా కోల్పోయింది. 

ఇదిలా ఉంటే, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మరో ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(22 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్‌; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్‌ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్‌) శతకంతో కదంతొక్కితే పుజారా (127 బంతుల్లో 61; 9 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (101 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్‌) తమ వంతు పాత్ర పోషించారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌట్‌ కాగా, 290 వద్ద ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.
చదవండి: అచ్చం సెహ్వాగ్‌లాగే.. సచిన్‌ ఒక్కడే అత్యధికంగా ఇలా..!
 

మరిన్ని వార్తలు