Rohit Sharma Viral Tweet: చెప్పాడంటే చేస్తాడంతే.. అంటున్న రోహిత్‌ అభిమానులు

5 Sep, 2021 13:58 IST|Sakshi

ఓవల్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా స్టార్‌ ఓపెనర్ రోహిత్ శర్మ(256 బంతుల్లో 127;14 ఫోర్లు, సిక్స్‌) అద్భుత శతకంతో జట్టును పటిష్ట స్థితికి చేర్చిన సంగతి తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ 94 పరుగుల వద్ద మొయిన్ అలీ వేసిన 64 ఓవర్ ఐదో బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాది కెరీర్‌లో తొలి ఓవర్‌సీస్ టెస్ట్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా రోహిత్‌కిది ఎనిమిదవ టెస్ట్ సెంచరీ. 

ఇదిలా ఉంటే, రోహిత్‌ శర్మ ఎప్పుడో 2016లో చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. దీన్ని ట్రోల్‌ చేస్తున్న అతని అభిమానులు రోహిత్ చెప్పాడంటే చేస్తాడంతే అంటూ కామెంట్ల రూపంలో హంగామా చేస్తున్నారు. ఇంత‌కీ ఆ ట్వీట్ ఏంటంటే.. మ‌నం ఏదైతే చేయ‌లేమని జ‌నం అనుకుంటారో.. దానిని చేసి చూపించ‌డం కంటే ఆనందం మ‌రొక‌టి ఉండ‌దని రోహిత్‌ 2016, సెప్టెంబ‌ర్ 14న ట్వీట్ చేశాడు. 
చదవండి: అచ్చం సెహ్వాగ్‌లాగే.. సచిన్‌ ఒక్కడే అత్యధికంగా ఇలా..!

ఆ ట్వీట్‌ను ఇప్పుడు రోహిత్‌ అభిమానులు వైర‌ల్‌గా మార్చేశారు. ఎందుకంటే.. టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 8 ఏళ్లు అవుతున్నా, విదేశాల్లో ఒక్క సెంచ‌రీ కూడా చేయ‌లేక‌పోయాడ‌న్న అప‌వాదు రోహిత్‌పై ఉంది. మొత్తానికి ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ ఆ అప‌వాదును చెరిపేసుకున్నాడు. కీల‌క‌మైన సమయంలో సెంచ‌రీ చేసి త‌న స‌త్తా ఏంటో చాట‌డంతోపాటు జట్టును కూడా ఆదుకుని, త‌న చిరకాల వాంఛ‌ను నెర‌వేర్చుకున్నాడు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లి(22 బ్యాటింగ్‌; 4 ఫోర్లు), రవీంద్ర జడేజా (9 బ్యాటింగ్‌; 2 ఫోర్లు)ఉన్నారు. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆట నిలిపి వేసే సమయానికి భారత్‌ 92 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. తద్వారా 171 పరుగుల కీలక ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. 
చదవండి: డుప్లెసిస్‌ ఊచకోత.. 51 బంతుల్లోనే శతక్కొట్టుడు..

మరిన్ని వార్తలు