IND Vs ENG 4th Test: శార్దూల్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌.. సెహ్వాగ్‌ రికార్డు సహా మరో రికార్డు బద్దలు

3 Sep, 2021 11:07 IST|Sakshi

ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీని(31 బంతులు) నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(32 బంతులు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ బాది అగ్రస్థానంలో నిలిచాడు.

ఇక ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా శార్దూల్ మరో రికార్డును నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఇయాన్ బోథమ్(32 బంతుల్లో) పేరిట ఈ రికార్డు ఉండగా.. శార్దూల్ దాన్ని అధిగమించాడు. 1986లో ఇదే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బోథమ్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఇక, 127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శార్దూల్ తన సుడిగాలి ఇన్నంగ్స్‌తో  గట్టెక్కించాడు. టీ20 తరహా బ్యాటింగ్‌తో 8వ వికెట్‌కు ఉమేశ్ యాదవ్(10)తో కలిసి 63 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించాడు.

రాబిన్సన్ వేసిన 60వ ఓవర్‌లో వరుసగా 4, 6 బాదిన శార్దూల్.. 31 బంతుల్లో కెరీర్‌లో రెండో అర్థశతకం పూర్తి చేశాడు. శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్‌ కారణంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేయగలిగింది. కెప్టెన్ కోహ్లీ (96 బంతుల్లో 50; 8 ఫోర్లు) మినహా మరెవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(4/55), ఓలి రాబిన్సన్(3/38) భారత్ పతనాన్ని శాసించగా.. జేమ్స్ అండర్సన్, క్రెయిగ్‌ ఓవర్టన్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం టీమిండియా బౌలర్లు కూడా చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసి ఎదురీదుతోంది. బుమ్రా(2/15), ఉమేశ్‌(1/15) ఇంగ్లండ్‌ టపార్డర్‌ పతనాన్ని శాసించారు.
చదవండి: అవిష్క సూపర్‌ శతకం.. సఫారీలపై లంకేయుల జయకేతనం

మరిన్ని వార్తలు