Ind Vs Eng 5th Test: జాతి వివక్ష.. టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ..

5 Jul, 2022 12:10 IST|Sakshi
టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. స్టేడియంలో ప్రేక్షకులు(PC: Twitter )

స్పందించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు

India Vs England 5th Test Day 4: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా రీషెడ్యూల్డ్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చిన భారత అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో కొంతమంది టీమిండియా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర రీతిలో వారిని దూషించారు. 

ఈ మేరకు ఓ ట్విటర్‌ యూజర్‌ సోషల్‌ మీడియా వేదికగా తమకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఇంగ్లండ్‌ అభిమానులు తమను ఉద్దేశించి జాతి వివక్షపూరిత వ్యాఖ్యలతో దూషించారని ఆరోపించారు. ఈ విషయం గురించి అక్కడున్న వాళ్లకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.

తమతో పాటు అక్కడున్న మహిళలు, చిన్నారుల భద్రత కూడా ప్రమాదంలో పడిందని, సిబ్బందిలో ఒక్కరు కూడా తమకు సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఆరోపించారు. నాగరిక సమాజంలో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు, భారత క్రికెట్‌ నియంత్రణ మండలిని ట్యాగ్‌ చేస్తూ తమ ఆవేదనను పంచుకున్నారు.

ఈ విషయంపై స్పందించిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు.. ‘‘టెస్టు మ్యాచ్‌ సందర్భంగా కొంతమంది జాతి వివక్ష ప్రదర్శిస్తూ అసభ్య పదజాలం వాడినట్లు మా దృష్టికి వచ్చింది. ఇందుకు మేము చింతిస్తున్నాం. ఎడ్జ్‌బాస్టన్‌ అధికారులతో మేము మాట్లాడుతున్నాం. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం. క్రికెట్‌లో జాతి వివక్షకు తావు లేదు’’ అని ట్వీట్‌ చేసింది.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ ఐదో టెస్టు స్కోర్లు:
►టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 416 ఆలౌట్‌
►ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 284 ఆలౌట్‌
►టీమిండియా రెండో ఇన్నింగ్స్‌: 245 ఆలౌట్‌
►ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 259/3.

చదవండి: Dutee Chand: మసాజ్‌ చేయమని బెదిరించేవారు.. షాకింగ్‌ విషయాలు వెల్లడించిన భారత మహిళా అథ్లెట్‌

మరిన్ని వార్తలు