IND VS ENG 5th Test: ఐసీసీ ఆ విషయాలు పరిగణలోకి తీసుకుంటే 2-2తో సిరీస్‌ సమం అయినట్టే..

12 Sep, 2021 16:51 IST|Sakshi

లండన్‌: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10 నుంచి జరగాల్సిన ఐదో టెస్ట్‌ రద్దైన నేపథ్యంలో మ్యాచ్‌ ఫలితంపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని ఆశ్రయించింది. సందిగ్ధత నెలకొన్న ఈ విషయంలో ఎదో ఒక పరిష్కారం చూపాలని ఐసీసీని కోరింది. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ ఫలితంపై ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఐసీసీ డిస్ప్యూట్‌ రిసొల్యూషన్‌ కమిటీ (డీఆర్సీ)కి లేఖ రాశామని ఈసీబీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. కరోనా కేసుల వల్ల మ్యాచ్‌ రద్దైందని ప్రకటిస్తే.. తమకు 40 మిలియన్‌ పౌండ్ల నష్టం వాటిల్లుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో సరైన పరిష్కారం చూపితే ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ చేసుకునే వీలుంటుందని ఇంగ్లీష్ బోర్డు పేర్కొంది. 

కాగా, ఈ విషయమై పరిష్కారం చూపేందుకు ఐసీసీ ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకవేళ ఐదో టెస్ట్‌ను పూర్తిగా రద్దు(రీషెడ్యూల్‌ చేయకుండా) చేస్తే.. భారత్ 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. అప్పుడు దీన్ని నాలుగు టెస్ట్‌ల సిరీస్‌గా పరిగణించాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రతిపాదనకు ఈసీబీ ఒప్పుకోకపోవచ్చు. రెండోది.. టీమిండియానే ఈ మ్యాచ్‌ ఆడటానికి విముఖత చూపినందున ఇంగ్లండ్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. మ్యాచ్‌ ఆడటానికి ఇంగ్లండ్‌ జట్టు సిద్ధంగా ఉన్నా.. కరోనా కారణంగా భారత్‌ ఒప్పుకోలేదు కాబట్టి ఫలితాన్ని ఇంగ్లండ్‌కు అనుకూలంగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే 2-2తో సిరీస్‌ సమం అవుతుంది. అప్పుడు ఇంగ్లండ్ బోర్డు ఇన్సూరెన్స్‌ కూడా క్లెయిమ్‌ చేసుకునే వీలుంటుంది. 

ఇదిలా ఉంటే, నాలుగో టెస్ట్‌కు ముందు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరవగా.. అతనితో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడే రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు కూడా వైరస్ సోకింది. అనంతరం టీమ్ ఫిజియో నితిన్ పటేల్‌కు, ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్‌‌‌‌లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లందరికీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్‌గా తేలింది. అయినప్పటికీ భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్ట్‌లో ఆడలేమని బీసీసీఐకి లేఖ రాసింది.

రీషెడ్యూల్‌ కోసం రంగంలోకి గంగూలీ..
ఐదో టెస్ట్ మ్యాచ్‌ రద్దవడంతో ఈసీబీకి సుమారు 40 మిలియన్‌ పౌండ్ల నష్టం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో భవిష్యత్‌లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఈసీబీతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇదే విషయంపై ఈసీబీ ప్రతినిధులతో మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరలో ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడని తెలుస్తోంది. సెప్టెంబర్‌ 22న లేదా 23న గంగూలీ అక్కడికి వెళ్లి ఈసీబీతో పాటు మ్యాచ్‌ ప్రసార హక్కుదారులతో చర్చలు జరుపుతాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ఈలోపు ఐసీసీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాదా పర్యటన రద్దయ్యే అవకాశం ఉంది.
చదవండి: కోవిడ్‌ బూచి చూపించి టీమిండియా డ్రామాలాడింది.. అంతా ఐపీఎల్‌ కోసమే..!

మరిన్ని వార్తలు