IND VS ENG 5th Test: కోహ్లి, స్మిత్‌లను దాటేసిన రూట్

6 Jul, 2022 11:01 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదో టెస్ట్‌లో (రీ షెడ్యూల్డ్‌) ఇంగ్లండ్‌ 7 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జో రూట్‌ (142), జానీ బెయిర్‌స్టో (114) అజేయ శతకాలతో ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని  అందించారు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల పటౌడీ ట్రోఫీని ఇంగ్లండ్‌ 2-2తో సమం చేసుకుంది. 

ఇదిలా ఉంటే, కెరీర్‌ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న జో రూట్‌ ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా విరాట్‌ కోహ్లి, స్టీవ్‌ స్మిత్‌లను అధిగమించాడు. రెండున్నరేళ్లుగా సెంచరీల మోత మోగిస్తున్న (11 శతకాలు) రూట్‌.. తాజా శతకంతో కోహ్లి (27), స్మిత్‌ (27) సెంచరీల రికార్డును దాటేశాడు. ఇప్పటివరకు 121 టెస్ట్‌లు ఆడిన రూట్‌ 28 శతకాలను బాదాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో రూట్‌ బాదిన శతకాలే ఇప్పటివరకు అత్యధికం. ఫాబ్‌ ఫోర్‌గా చెప్పుకునే విరాట్‌, స్మిత్‌, విలియమ్సన్‌ గణాంకాలతో పోలిస్తే రూట్‌ గణాంకాలు అత్యుత్తమంగా ఉన్నాయి. 

కోహ్లి.. 102 టెస్ట్‌ల్లో 7 డబుల్‌ సెంచరీలు, 27 సెంచరీలు, 28 అర్ధసెంచరీల సాయంతో 49.53 సగటున 8074 పరుగులు చేయగా.. స్టీవ్‌ స్మిత్‌ 86 టెస్ట్‌ల్లో 3 డబుల్‌ సెంచరీలు, 27 సెంచరీలు, 36 అర్ధసెంచరీల సాయంతో 59.38 సగటున 8016 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ సారధి విలియమ్సన్‌.. 88 టెస్ట్‌ల్లో 4 డబుల్‌ సెంచరీలు, 24 సెంచరీలు, 33 అర్ధసెంచరీల సాయంతో 52.63 సగటున 7368 పరుగులు చేయగా.. రూట్‌ 121 టెస్ట్‌ల్లో 5 డబుల్‌ సెంచరీలు, 28 సెంచరీలు, 54 అర్ధసెంచరీల సాయంతో 50.77 సగటున 10458 పరుగులు స్కోర్‌ చేశాడు. 
చదవండి: IND VS ENG 5th Test: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో భారీ షాక్‌

మరిన్ని వార్తలు