IND VS ENG 5th Test: ఒక్క టెస్ట్ మ్యాచ్‌ రద్దవడం వల్ల ఇంత భారీ నష్టమా..?

10 Sep, 2021 20:15 IST|Sakshi

మాంచెస్టర్‌: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దైన విషయం తెలిసిందే. భారత శిబిరంలో కోచ్‌ రవిశాస్త్రి సహా నలుగురు కోచింగ్‌ సిబ్బంది కరోనా బారిన పడటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డుల పరస్పర అంగీకారంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఒక్క మ్యాచ్‌ రద్దు కావడం వల్ల లాంకషైర్‌ క్రికెట్‌కు, ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ)కు భారీ నష్టం వాటిల్లిందని సమాచారం. ఈ నష్టం భారత కరెన్సీలో వందల కోట్లకు పైగా ఉండవచ్చని ఈసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రసార హక్కులు ఇతరత్రా మార్గాల ద్వారా 30 మిలియన్ పౌండ్లు (దాదాపు రూ. 304 కోట్లు) వరకు నష్టం వాటిల్లిందంటూ ఈసీబీకి అధికారి ఒకరు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే అర్ధంతరంగా రద్దైన ఈ మ్యాచ్‌ను వచ్చే ఏడాది భారత పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు నిర్వహించాలని ఇరు బోర్డులు పరస్పర అంగీకారానికి వచ్చినట్లు సమాచారం​. ఈ విషయమై బీసీసీఐ సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు జై షా వెల్లడించారు. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్ 2021-23లో భాగం జరుగుతున్న సిరీస్‌ కాబట్టి ఇరు జట్లకు అన్యాయం జరగకుండా ఉండేందుకే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా, మ్యాచ్‌ రద్దు ప్రకటన అనంతరం తొలుత టీమిండియా మ్యాచ్‌ను వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌మైందంటూ (forfeit the match) ప్రకటన విడుదల చేసిన ఈసీబీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ పదాన్ని తొలగించి.. టీమిండియా కరోనా కేసుల భయం కారణంగా జట్టును బరిలోకి దించలేకపోతుందంటూ మార్చేసింది. మరోవైపు సిరీస్‌ ఫలితంపై ఐసీసీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోగా ఈసీబీ మాత్రం ఓ విషయాన్ని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్‌ రీ షెడ్యూల్‌ అయినా.. ఆ మ్యాచ్‌తో ప్రస్తుత సిరీస్‌కు సంబంధం ఉండదని, అది స్టాండ్‌ అలోన్‌ మ్యాచ్‌ అవుతుందని(సెపరేట్‌ మ్యాచ్‌) ఈసీబీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్‌ను టీమిండియా(2-1) అనధికారికంగా కైవసం చేసుకున్నట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  
చదవండి: రీ షెడ్యూల్‌ అయినా సిరీస్‌తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్‌

మరిన్ని వార్తలు