Hardik Pandya: 4 వికెట్లు, 71 పరుగులు.. మామూలు విషయం కాదు! వాళ్ల ఇగోతో ఆడుకుంటున్నాడు!

18 Jul, 2022 12:52 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యా- లియామ్‌ లివింగ్‌స్టోన్‌(PC: ECB)

India Vs England ODI Series 2022- India Win: రీఎంట్రీలో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా. టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత జట్టుకు దూరమైన అతడు.. గోడకు కొట్టిన బంతిలా దుసుకువచ్చాడు. తొలుత ఐపీఎల్‌-2022లో గుజరాత్ టైటాన్స్‌ను ఎంట్రీలోనే గెలిపించి కెప్టెన్‌గా సత్తా చాటిన పాండ్యా.. జాతీయ జట్టులోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.

బౌలింగ్‌లో లోపాలు సరిదిద్దుకున్న పాండ్యా.. ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో 7 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేసిన అతడు.. కేవలం 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా... ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 55 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 71 పరుగులు సాధించాడు.

తద్వారా 5 వికెట్ల తేడాతో టీమిండియా ఇంగ్లండ్‌ మీద గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సిరీస్‌ ఆసాంతం మెరుగ్గా రాణించిన పాండ్యాను ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు వరించింది. అదే విధంగా.. 113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రిషభ్‌ పంత్‌ ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌గా నిలిచాడు.

ఇగోతో ఓ ఆట ఆడుకుంటున్నాడు!
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా.. హార్దిక్‌ పాండ్యాపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘‘ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు కాబట్టి రిషభ్‌ పంత్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అయ్యాడు. వాస్తవానికి పంత్‌ ఆటను నేను ఎంతగానో ప్రేమిస్తాను. అలా అని హార్దిక్ పాండ్యాను తక్కువ చేయలేము కదా! 

నాలుగు కీలకమైన వికెట్లు తీసి, 71 పరుగులు చేయడం అంటే సాధారణ విషయం కాదు. నిజం చెప్పాలంటే అతడు ఇతరుల ‘ఇగో’తో ఆడుకుంటున్నాడు’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఒకవేళ హార్దిక్‌ ఫిట్‌నెస్‌ కాపాడుకుంటే.. టీమిండియాలో అతడిని మించిన విలువైన ఆటగాడు మరెవరూ ఉండరని పాండ్యాను ఆకాశానికెత్తాడు.

కాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ సహా బెన్‌ స్టోక్స్‌, కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ తదితర కీలక బ్యాటర్ల వికెట్లు తీసి ఆతిథ్య జట్టు పతనాన్ని శాసించాడు.  

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ మూడో వన్డే:
►వేదిక: ఎమిరేట్స్‌ ఓల్డ్‌ ట్రఫోర్డ్‌, మాంచెస్టర్‌
►టాస్‌: ఇండియా- బౌలింగ్‌
►ఇంగ్లండ్‌ స్కోరు: 259 (45.5)
►ఇండియా స్కోరు:  261/5 (42.1)
►విజేత: ఇండియా.. 5 వికెట్ల తేడాతో గెలుపు
►ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్: రిషభ్‌ పంత్‌(113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 125 పరుగులు- నాటౌట్‌)
►ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌: హార్దిక్‌ పాండ్యా(మూడో వన్డేలో 4 వికెట్లు తీయడం సహా 71 పరుగులు సాధించాడు)

చదవండి: ENG vs IND: చరిత్ర సృష్టించిన హార్దిక్‌ పాండ్యా.. తొలి భారత ఆటగాడిగా..!
ENG vs IND: సెంచరీతో చెలరేగిన పంత్‌..వన్డేల్లో అరుదైన రికార్డు..!

మరిన్ని వార్తలు