రెండో టెస్టులో అశ్విన్‌ను ఆడించాల్సిందే: ఆకాశ్‌ చోప్రా

11 Aug, 2021 21:12 IST|Sakshi

లార్డ్స్‌: తొలి టెస్టులో టీమిండియా విజయం అంచుల దాకా వచ్చినా వరుణుడి కారణంగా దానిని దక్కించుకోలేకపోయింది. రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్సిన్నర్‌ లేకపోవడం తొలి టెస్టులో టీమిండియాకు ఇబ్బంది తలెత్తిందని టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ‘టీమిండియా ఐదు బౌలర్లతో బరిలో దిగుతూ, బ్యాటింగ్‌లో రాజీ పడకుండా ఆడాలని చూస్తోంది. ఇది మంచిదే కానీ రవిచంద్రన్ అశ్విన్ కూడా బాగా బ్యాటింగ్ చేయగలడు. అతనికి టెస్టుల్లో నాలుగు సెంచరీలున్న విషయం మరిచిపోకూడదు. టీమిండియా టెస్టు సిరీస్ గెలవాలంటే అశ్విన్ లాంటి స్టార్ ఆల్‌రౌండర్‌కి జట్టులో చోటు ఇవ్వాల్సిందే...శార్దూల్ ఠాకూర్ స్థానంలో అశ్విన్ ఆడిస్తే బెటర్... లార్డ్స్ లాంటి పిచ్‌లో అశ్విన్ చక్కని ప్రదర్శన ఇవ్వగలడు. ఇప్పటికే ఈ మైదానంలో ‘ది హండ్రెడ్’ టోర్నీ ఆడారు. కాబట్టి స్పిన్‌కి చక్కగా సహకరించవచ్చు. లార్డ్స్ టెస్టు ఐదు రోజుల పాటు సాగినా సాగకపోయినా... అశ్విన్‌ను ఆడించడం వల్ల టీమిండియాకి అన్ని విధాల కలిసి రావచ్చు.. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలో దిగుతున్నారు కాబట్టి ఇషాంత్ శర్మ కొంత కాలం వేచి చూడక తప్పదు.' అంటూ తెలిపాడు.

తొలి టెస్టులో జో రూట్‌తో పాటు కీలక సమయంలో బట్లర్ వికెట్ తీసిన స్వింగ్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. అతను రెండో టెస్టుకి అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. శార్దూల్ ఠాకూర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఆడించాలని కొందరు అంటుంటే... ఇషాంత్ శర్మ లేదా ఉమేశ్ యాదవ్ వంటి ఫాస్ట్ బౌలర్లకు అవకాశం ఇస్తే మంచిదని మరికొందరు పేర్కొన్నారు. ఇక ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య రేపటినుంచి లార్డ్స్‌ వేదికగా రెండో టెస్టు జరగనుంది.

మరిన్ని వార్తలు