షమీ, బుమ్రాలకు లభించిన ఘన స్వాగతం చూస్తే ఔరా అనాల్సిందే..!

16 Aug, 2021 19:40 IST|Sakshi

లండ‌న్: ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టెయిలెండర్లు మహ‌మ్మద్ ష‌మీ(70 బంతుల్లో 56 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌), జస్ప్రీత్ బుమ్రా(64 బంతుల్లో 34 నాటౌట్‌; 3 ఫోర్లు) అద్భుత ప్రద‌ర్శన కనబర్చారు. 209 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న భారత్‌ను అద్భుత పోరాట పటిమతో ఆదుకున్నారు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్‌కు అజేయమైన 89 పరుగులు జోడించి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. ముఖ్యంగా షమీ ఇంగ్లండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి కెరీర్‌లో రెండో హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. టీమిండియాకు 271 పరుగుల ఆధిక్యం లభించాక.. 298 పరగుల వద్ద కెప్టెన్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. 

అయితే, లంచ్‌ విరామ సమయంలో షమీ, బుమ్రాలు డ్రెసింగ్‌ రూమ్‌లోకి అడుగుపెట్టాక.. సహచర క్రికెటర్లు వారికి ఘన స్వాగతం పలికారు. చప్పట్లు, ఈలలతో గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. సభ్యులంతా లేచి నిలబడి అద్భుత ఇన్నింగ్స్‌ అడిన షమీ, బుమ్రాలను కరతాళధ్వనులతో ఘ‌న‌మైన రీతిలో ఆహ్వానించారు. ఆ అద్భుత క్షణాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు.

ఇదిలా ఉంటే, టీమిండియా నిర్దేశించిన 272 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌ జట్టు కేవలం ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. టీమిండియా పేసర్లు విశ్వరూపం ప్రదర్శించడంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. తొలి ఓవర్లోనే బుమ్రా ఓపెనర్‌ రోరి బర్న్స్ ను డకౌట్‌ చేయగా, రెండో ఓవర్‌లో షమీ మరో ఓపెనర్‌ సిబ్లీని డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్‌ జట్టు ఒక్క పరుగుకే ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. క్రీజ్‌లో కెప్టెన్‌ జో రూట్‌, హసీబ్‌ హమీద్‌ ఉన్నారు.
చదవండి: రషీద్‌ ఖాన్‌, నబీ ఇద్దరూ అందుబాటులో ఉంటారు: స‌న్‌రైజ‌ర్స్‌

మరిన్ని వార్తలు