Ind Vs Eng: కోహ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఈసీబీ.. 22న యూకేకు గంగూలీ!

11 Sep, 2021 13:57 IST|Sakshi

కోహ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఈసీబీ

ఈనెల 22న యూకే వెళ్లనున్న గంగూలీ!

India Vs England 5th Test Postponed Indefinitely: టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య శుక్రవారం జరగాల్సిన ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడటంతో క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పటికే 2-1 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్న కోహ్లి సేన.. ఇంగ్లండ్‌ను ఓడించి ట్రోఫీ గెలుస్తుందా లేదా సమం చేస్తుందా అనే చర్చ జోరుగా నడిచింది. అయితే, కోవిడ్‌ కారణంగా ఆరంభానికి ముందు ఆఖరి టెస్టు రద్దు కావడంతో అందరూ ఉసూరుమన్నారు. బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ దుస్థితి దాపురించిందంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా ఇటీవల బుక్‌లాంచ్‌ చేసిన టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రికి కరోనా సోకడంతో.. ఆయన బాధ్యతారాహిత్యం వల్లే ఇలా జరిగిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఐదో టెస్టును నిరవధికంగా వాయిదా వేసిన క్రమంలో భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి సంబంధించిన ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ నేపథ్యంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఇరు జట్లకు కీలకంగా మారిన విషయం తెలిసిందే. అయితే, చివరి టెస్టుకు ముందు టీమిండియా సెకండ్‌ ఫిజియో యోగేశ్‌ పర్మార్‌కు పాజిటివ్‌గా తేలడంతో మ్యాచ్‌ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. 

ఆటగాళ్లందరికీ పరీక్షలు నెగటివ్‌ వచ్చినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్‌ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఈసీబీ ఆ తర్వాత నిరవధికంగా వాయిదా వేసినట్లు వెల్లడించింది. కాగా రెండు రోజుల తర్వాత మ్యాచ్‌ను నిర్వహించాల్సిందిగా కోహ్లి ప్రతిపాదించినట్లు సమాచారం. హెడ్‌ కోచ్‌తో పాటు కీలక అడ్వైజర్లు అందుబాటులో లేకపోవడం, ఫిజియోథెరపిస్టు కూడా కరోనా బారిన పడటంతో రెండు లేదా మూడు రోజుల అనంతరం మ్యాచ్‌ ఆడించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఈసీబీ మాత్రం ఈ ప్రపోజల్‌ను తిరస్కరించి మ్యాచ్‌ను నిరవధికంగా వాయిదా వేసేందుకే మొగ్గు చూపడం గమనార్హం. 

ఈనెల 22న యూకేకు
ఇక మ్యాచ్‌ రీషెడ్యూల్‌ గురించి చర్చించే క్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, ఈనెల 22న ఇంగ్లండ్‌ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ అర్ధంతరంగా ఆగిపోవడం, తద్వారా ఈసీబీకి జరిగిన నష్టం, తిరిగి ఎప్పుడు మ్యాచ్‌ నిర్వహించాలన్న అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.  

చదవండి: Gautam Gambhir: కీలక ప్రకటన.. త్వరలోనే కొత్త లీగ్‌ ఆరంభం!

మరిన్ని వార్తలు