Ind Vs Eng: ఓ పీడకల ముగిసింది.. కానీ ఎందుకిలా చేశారు?!

10 Sep, 2021 16:18 IST|Sakshi

రవిశాస్త్రి, కోహ్లి సేనపై ఇంగ్లిష్‌ మీడియా ఆగ్రహం

ట్రోఫీతో వస్తారనుకుంటే ఇలా చేశారేంటని ఫ్యాన్స్‌ ట్రోలింగ్‌

Ind Vs Eng 5th Test Called Off: భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక ఐదో టెస్టు రద్దైన నేపథ్యంలో టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, ఆటగాళ్లపై ఇంగ్లిష్‌ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బుక్‌లాంచ్‌ ఈవెంట్‌కు హాజరై బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి కీలక మ్యాచ్‌ జరగకుండా అడ్డుపడ్డారంటూ దుమ్మెత్తిపోస్తోంది. కాగా ఈ ఈవెంట్లో పాల్గొన్న రవిశాస్త్రికి కరోనా సోకగా కోచ్‌లు భరత్‌ అరుణ్‌, శ్రీధర్‌ ఐసోలేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదో టెస్టుకు ముందు ఫిజియోథెరపిస్ట్‌ యోగేశ్‌ పర్మార్‌కు పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో ఆటగాళ్లందరికీ కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలినప్పటికీ మ్యాచ్‌ ఆడేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో  ఓవల్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో శుక్రవారం జరగాల్సిన చివరి మ్యాచ్‌ను కరోనా భయాల కారణంగా రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ క్రమంలో స్థానిక మీడియా భారత కోచ్‌లు, ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పిస్తోంది. ‘‘గురువారం రాత్రి పీసీఆర్‌ టెస్టుల్లో ఫలితం నెగటివ్‌గా తేలగానే అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఓ పీడకల ముగిసింది. అయితే, ఇదంతా చూస్తుంటే.. గేమ్‌ ఆడకుండా తప్పించుకునేందుకే వాళ్లు ఇలా చేశారా అనిపిస్తోంది. 

బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘించి ఇండియా కోచ్‌లు, ఆటగాళ్లు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావడం ఎంత వరకు సమంజసం. ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యం. నాలుగో టెస్టుకు రెండు రోజుల ముందుకు బుక్‌లాంచ్‌ ఈవెంట్‌కు వీరు వెళ్లినట్లు స్పోర్ట్స్‌మెయిల్‌ వెల్లడించింది’’ అని డైలీ మెయిల్‌ ఓ కథనం ప్రచురించింది. కాగా నాలుగో టెస్ట్ ప్రారంభానికి ముందు రవిశాస్త్రి సహా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మరికొందరు టీమిండియా సభ్యులు ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న విషయంపై బీసీసీఐ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.  

ఈ క్రమంలో కోవిడ్‌ కారణంగా ఐదో మ్యాచ్‌ రద్దు కావడంతో టీమిండియా తీరుపై విమర్శలు తీవ్రమయ్యాయి. ఇండియన్‌ ఫ్యాన్స్‌ సైతం.. ‘‘ఇదొక్కటి గెలిచేసి.. సిరీస్‌ కైవసం చేసుకుని ట్రోఫీతో తిరిగి వస్తారనుకుంటే ఇలా చేశారేంటి. రవిశాస్త్రి, కోహ్లి ఇలాగేనా ప్రవర్తించేది. ఎందుకిలా చేశారు’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. కాగా వచ్చే ఏడాది టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అప్పుడు ఈ మ్యాచ్‌ ఆడించి.. సిరీస్‌ విజేతను నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మ్యాచ్‌ రీషెడ్యూల్‌ గురించి ఈసీబీ- బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

చదవండి: India Tour Of South Africa: ఈసారైనా నెగ్గుకొచ్చేనా..?

మరిన్ని వార్తలు