జైస్వాల్‌ విషయంలో అతి చేయకండి: గంభీర్‌ ఘాటు విమర్శలు

3 Feb, 2024 20:40 IST|Sakshi

India vs England, 2nd Test: టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. వైజాగ్‌ స్టేడియంలో ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా ఈ ముంబై బ్యాటర్‌ డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే.

తద్వారా టెస్టుల్లో టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన మూడో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు జైస్వాల్‌. 22 ఏళ్ల 37 రోజుల వయసులో ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ ఈ ఫీట్‌ అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు యశస్వి జైస్వాల్‌ ప్రతిభను కొనియాడుతున్నారు. మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అయితే సర్‌ బ్రాడ్‌మన్‌ కంటే ఎక్కువంటూ  ఆకాశానికెత్తాడు. ఇక అభిమానులేమో.. యశస్వి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. 

అదే విధంగా సోషల్‌ మీడియా వేదికగా అతడి పేరును ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓవర్‌హైప్‌ క్రియేట్‌ చేసి అతడిపై ఒత్తిడి పెంచవద్దని అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి చేశాడు.

మనకు ఓ అలవాటు ఉంది
ఈ మేరకు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘చిన్న వయసులోనే అరుదైన రికార్డులు సాధిస్తున్న యశస్వికి శుభాకాంక్షలు. అతడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తనను స్వేచ్ఛగా ఆడనివ్వండి. భారత్‌లో అందరికీ ఓ పాత అలవాటు ఉంది.

హీరోలను చేసి ఒత్తిడి పెంచుతారు
ముఖ్యంగా మీడియా.. ఆటగాళ్ల విజయాలను అతి చేసి చూపించి.. వారికి ఏదో ఒక ట్యాగ్‌ అంటగట్టి... హీరోలను చేస్తుంది. ఇలాంటి ప్రచారం వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగిపోతుంది. కాలక్రమంలో వాళ్లు సహజమైన, తమదైన ఆటను మర్చిపోతారు. అంచనాలు తట్టుకోలేక ఒత్తిడిలో కూరుకుపోతారు’’ అని గౌతం గంభీర్‌ ఈ సందర్భంగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా వైజాగ్‌లో టెస్టులో జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ, పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అద్భుత ప్రదర్శన కారణంగా రెండో రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఆధిపత్యం సంపాదించింది. ఇంగ్లండ్‌ కంటే 171 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 

చదవండి: Ind vs Eng: అఫీషియల్‌.. అందుకే కోహ్లి టెస్టులకు దూరం

whatsapp channel

మరిన్ని వార్తలు