Ind Vs Eng: వాళ్లకు ఐపీఎల్‌ ముఖ్యం.. ఇది చాలా డేంజర్‌: బీసీసీఐపై ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ ఘాటు వ్యాఖ్యలు

30 Jun, 2022 11:09 IST|Sakshi

India Vs England 5Th Test: క్రికెట్‌ ప్రపంచంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మంది యువ ఆటగాళ్లను స్టార్లను చేయడంతో పాటు కాసుల వర్షం కురిపించి వాళ్లను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. అంతేగాక క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ప్రతిభను నిరూపించుకున్న వర్ధమాన ఆటగాళ్లలో చాలా మంది జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్నారు.

ఇక ఇటీవల వేల కోట్లకు అమ్ముడైన ఐపీఎల్‌ మీడియా రైట్స్‌ చాలు.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆదాయం రోజురోజుకూ ఎంతలా పెరుగుతుందో అర్థం చేసుకోవడానికి!ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే! మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానం చూరగొన్న ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌ను విమర్శించే వాళ్లూ లేకపోలేదు.

పొగిడే వాళ్లే కాదు.. తిట్టే వాళ్లూ కూడా!
ఇప్పటికే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇటువంటి పొట్టి ఫార్మాట్‌ లీగ్‌ల కారణంగా సంప్రదాయ క్రికెట్‌కు ప్రమాదం పొంచి ఉందని మండిపడుతున్నారు. అంతేగాక ఇలాంటి లీగ్‌ ఫ్రాంఛైజీలతో ఒప్పందాలు, షెడ్యూల్‌ కారణంగా కొంత మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు దూరమవడం వంటి అంశాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ పాల్‌ న్యూమన్‌ సైతం ఐపీఎల్‌ వైపు వేలెత్తి చూపాడు. అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ల కంటే కూడా బీసీసీఐకి ఈ లీగ్‌ ఎక్కువైందని విమర్శించాడు. కాగా గతేడాది ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆఖరి మ్యాచ్‌ జూలై 1 నుంచి ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి డైలీ మెయిల్‌ యూకేకు రాసిన ఆర్టికల్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు న్యూమన్‌.

వాళ్లకు టెస్టు మ్యాచ్‌ కంటే ఐపీఎల్‌ ఎక్కువైంది!
ఈ మేరకు.. ‘‘టెస్టు సిరీస్‌ ఆడేందుకు గతేడాది వేసవిలో ఇంగ్లండ్‌ వచ్చిన భారత జట్టు ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో తమ మ్యాచ్‌ను ముగించాల్సింది.  కానీ ఆ మ్యాచ్‌ వాయిదా పడటానికి కారణమై డబ్బు చెల్లించి మ్యాచ్‌ చూడటానికి వచ్చిన ప్రేక్షకులను నిరాశ పరిచారు. కోవిడ్‌ కారణంగా దీనిని రద్దు చేస్తామనడం నవ్విపోయే అంశం.

ఆ తర్వాత కూడా వాళ్లు ఐపీఎల్‌ వైపు మొగ్గు చూపారే కానీ.. వెంటనే టెస్టు మ్యాచ్‌ పూర్తి చేయాలన్న సోయిలో లేరు. నిజంగా ఇలాంటి దృక్పథం టెస్టు క్రికెట్‌కు ఎంతో ప్రమాదకరం’’ అని ఘాటు విమర్శలు చేశాడు న్యూమన్‌. కాగా జూలై 1 నుంచి రీషెడ్యూల్డ్‌ మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కోవిడ్‌ బారిన పడటం గమనార్హం. ఇంగ్లండ్‌ జట్టులోనూ కోవిడ్‌ కలకలం రేగింది.
చదవండి: ENG Vs IND 5th Test: "అతడు అద్భుతమైన ఆటగాడు.. అటువంటి వ్యక్తిని ఇంతవరకూ చూడలేదు"

మరిన్ని వార్తలు