IND Vs ENG-Anderson: ఆండర్సన్‌కు ఇదే ఆఖరి సిరీస్‌.. ఐదో టెస్ట్‌ అనంతరం రిటైర్మెంట్‌..?

31 Aug, 2021 12:08 IST|Sakshi

లండన్: ఇంగ్లండ్ వెటరన్‌ పేసర్‌ జిమ్మీ అండర్సన్‌ భారత్‌తో టెస్ట్‌ సిరీస్‌ అనంతర​ క్రికెట్‌కు వీడ్కోలు పలుకబోతున్నాడని ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ అభిప్రాయపడ్డాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదో టెస్ట్ అతనికి చివరి మ్యాచ్ కావచ్చని ఆయన పేర్కొన్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆండర్సన్‌.. భారత్‌తో సిరీస్‌ అనంతరం టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదని తెలిపాడు. టీమిండియా కెప్టెన్‌ కోహ్లి వికెట్‌తో ఆండర్సన్‌ తన క్రికెట్‌ కెరీర్‌ను ముగించవచ్చని జోస్యం చెప్పాడు. కాగా, 39 ఏళ్ల ఆండర్సన్‌ టీమిండియాతో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. మూడు టెస్టుల్లో ఇప్పటికే 13 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది జిమ్మీ మొత్తం 30 వికెట్లు పడగొట్టగా.. అందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి .

అండర్సన్‌ ఇంగ్లండ్ తరఫున 165 టెస్ట్ మ్యాచ్‌ల్లో 630 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 31 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అతని అత్యుత్తమ గణాంకాలు 7/42. అలాగే జిమ్మీ.. బ్యాట్స్‌మెన్‌గా 1246 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 81. ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన అండర్సన్.. టెస్ట్ ఫార్మాట్లో కొనసాగేందుకు 2015లో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆండర్సరన్‌ 194 వన్డేల్లో 269 వికెట్లు, 19 టీ20ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్లతో పోలిస్తే ఆండర్సన్‌ టెస్టుల్లో అత్యుత్తమంగా రాణించాడు. ఈ క్రమంలో అతను స్వింగ్ కింగ్‌గా పేరొందాడు.

ఇదిలా ఉంటే, భారత్‌తో ముగిసిన మూడో టెస్ట్‌లో అండర్సన్ పలు అరుదైన ఘనతలను సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు అత్యధికంగా మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటి వరకు ఆండర్సన్ భారత్‌కు 330 మెయిడిన్ ఓవర్లు వేసాడు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో 1529 ఓవర్లు వేసిన అండర్సన్.. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ 1792 మెయిడిన్ ఓవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఇదే టెస్ట్‌లో 4 వికెట్లు పడగొట్టిన ఆండర్సన్.. ఇంగ్లీష్ గడ్డపై(స్వదేశంలో) టెస్ట్‌ల్లో 400 వికెట్ల మైలురాయిని అందుకున్న ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో శ్రీలంక స్పిన్‌ దిగ్గజం మురళీధరన్‌ తొలి స్థానంలో ఉన్నాడు. మురళీ స్వేదేశంలో 73 టెస్ట్‌ల్లో 493 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఇక టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో జిమ్మీ (630) మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీధరన్‌ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ 708 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 
చదవండి: ఇంగ్లండ్‌ జట్టులో రెండు మార్పులు.. బట్లర్‌ సహా మరో బౌలర్‌ ఔట్‌

మరిన్ని వార్తలు