James Anderson: 'బుమ్రా.. నన్నెందుకు టార్గెట్‌ చేశావ్‌'

15 Aug, 2021 16:16 IST|Sakshi

లార్డ్స్‌: టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్ను రెండో టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మూడో రోజు ఆట మరికాసేపట్లో ముగుస్తుందనగా బుమ్రా వేసిన ఓవర్‌ ప్రమాదకరంగా కనిపించింది. ఎంతలా అంటే క్రీజులో ఉన్న 11వ నంబర్‌ ఆటగాడు జేమ్స్‌ అండర్సన్‌ను టార్గెట్‌ చేశాడా అనిపించింది.  వరుసగా  షార్ట్‌ బంతులు విసురుతూ అండర్సన్‌ను బెంబెలెత్తించాడు.

బుమ్రా వేసిన తొలి బంతి హెల్మెట్‌కు తగలడంతో బిత్తరపోయిన అండర్సన్‌ కన్‌కషన్‌ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా బుమ్రా తగ్గలేదు. తర్వాతి బంతి పొత్తికడుపుపై బలంగా తాకగా, మరో బంతి పక్కటెముల మీదకు దూసుకొచ్చింది. ఈ క్రమంలో బుమ్రా ఒకే ఓవర్లో 4 నోబాల్స్‌ సహా మొత్తం 10 బంతులు విసిరాడు. ఆ తర్వాత షమీ వేసిన ఓవర్లో అండర్సన్‌ బౌల్డ్‌ కావడంతో ఇంగ్లండ​ ఇన్నింగ్స్‌ ముగిసింది. అనంతరం ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరుకుంటున్న క్రమంలో బుమ్రా బౌలింగ్‌ శైలితో ఇబ్బంది పడిన అండర్సన్‌ అతని వద్దకు వచ్చి.. '' నన్నెందుకు టార్గెట్‌ చేశావన్నట్లుగా '' అడిగాడు. దానికి బుమ్రా ఏం చెప్పకుండా చిరునవ్వుతో అతని పక్కనుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో ప్రత్యక్షం కావడంతో వైరల్‌గా మారింది. 

ఇక ఇంగ్లండ్‌ టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో  27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. కాగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ 8 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా 17 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 12, కేఎల్‌ రాహుల్‌ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్‌ అయింది.

మరిన్ని వార్తలు