IND Vs ENG 3rd Test: అరుదైన రికార్డుకు చేరువలో టీమిండియా పేసు గుర్రం.. 

24 Aug, 2021 15:38 IST|Sakshi

లండన్: టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య లీడ్స్ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మరో 5 వికెట్లు తీస్తే.. అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత పేసర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. 2018లో భారత టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. ఇప్పటి వరకూ 22 టెస్ట్‌ల్లో 22.62 సగటుతో 95 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఏకంగా ఆరు సార్లు 5 వికెట్ల ప్రదర్శన ఉండటం విశేషం. 

టెస్టుల్లో వేగంగా 100 వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ప్రస్తుతం కపిల్‌ దేవ్ టాప్‌లో ఉన్నాడు. కపిల్‌.. 25 టెస్టుల్లో 100 వికెట్ల మార్క్‌ను అందుకోగా, ఇప్పుడు ఆ రికార్డుపై బుమ్రా కన్నేశాడు. లీడ్స్ టెస్టులో బుమ్రా 5 వికెట్లు తీస్తే.. 23 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించి బౌలర్‌గా కపిల్‌ రికార్డును తిరగరాయనున్నాడు. ఇదిలా ఉంటే, టెస్ట్‌ క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన ఘనత ఇంగ్లండ్‌కు చెందిన జార్జ్‌ లోమాన్‌ పేరిట నమోదై ఉంది. జార్జ్‌.. కేవలం 16 టెస్ట్‌ల్లోనే 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 

ఈ జాబితాలో పాక్‌ స్పిన్నర్‌ యాసిర్‌ షా(17 టెస్ట్‌ల్లో) రెండో స్థానంలో ఉండగా భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(18 టెస్ట్‌ల్లో) మూడో స్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత్‌.. మూడో టెస్ట్‌లోనూ విజయఢంకా మోగించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే లీడ్స్‌కు చేరుకుని ముమ్మరంగా సాధన చేస్తోంది. కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, కేఎల్ రాహుల్, పంత్‌తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారతకాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. 
చదవండి: ఇంగ్లండ్‌ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ విజయానికి 50 ఏళ్లు

మరిన్ని వార్తలు