Jos Buttler- Virat Kohli: కోహ్లి ఆట తీరుపై విమర్శలు.. బట్లర్‌ ఘాటు వ్యాఖ్యలు! అతడు కూడా మనిషే..

15 Jul, 2022 11:14 IST|Sakshi
విరాట్‌ కోహ్లి- జోస్‌ బట్లర్‌(PC: ECB Cricket)

Ind Vs Eng 2nd ODI- Jos Buttler Comments On Kohli Form: గాయం కారణంగా ఇంగ్లండ్‌తో మొదటి వన్డేకు దూరమైన టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. తుదిజట్టులో కోహ్లి పేరు ఉందని తెలియగానే.. తనకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్‌లోనైనా అతడు రాణిస్తాడని అభిమానులు ఆశపడ్డారు. కానీ.. కోహ్లి మరోసారి నిరాశపరిచాడు.

లార్డ్స్ వన్డేలో 25 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 3 ఫోర్ల సాయంతో 16 పరగులు చేశాడు. విల్లే బౌలింగ్‌లో వికెట్‌​ కీపర్‌ జోస్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో కోహ్లి ఆటతీరుపై మరోసారి విమర్శలు వస్తున్నాయి.

అతడు కూడా మనిషే..!
ఈ నేపథ్యంలో కోహ్లి ఫామ్‌పై ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ స్పందించిన తీరు కోహ్లి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. విజయానంతరం బట్లర్‌ మాట్లాడుతూ.. ‘‘కోహ్లి కూడా మనిషే.. ఒకటీ రెండు మ్యాచ్‌లలో అతడు తక్కువ స్కోర్లకే పరిమితమై ఉండవచ్చు.

అయితే, ఒక్కటి మాత్రం నిజం. తను అత్యుత్తమ బ్యాటర్లలో ఒక్కడు. ఇంకా చెప్పాలంటే.. వన్డే క్రికెట్‌లో ప్రపంచంలోనే బెస్ట్‌ బ్యాటర్‌. సుదీర్ఘ కాలంగా అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. అయితే, ఏ ఆటగాడైనా ఒక్కోసారి ఫామ్‌లేమితో సతమతమవడం సహజం. మెరుగైన ప్రదర్శన చేయలేకపోతారు’’ అని కోహ్లికి మద్దతుగా నిలిచాడు.

కోహ్లి ఏంటో అతడి రికార్డులే చెబుతాయి!
ఇక ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌గా.. కోహ్లి వంటి క్లాస్‌ ప్లేయర్‌ తమతో మ్యాచ్‌లో రాణించకూడదనే తాము కోరుకుంటామని బట్లర్‌ వ్యాఖ్యానించాడు. కోహ్లి గురించి అతడి రికార్డులే మాట్లాడతాయని.. టీమిండియాను అతడు ఒంటిచేత్తో గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నాడు. అలాంటి వ్యక్తి నైపుణ్యాలపై సందేహాలు వ్యక్తం చేయడం, అతడి ఆట తీరును ప్రశ్నించడం సరికాదని బట్లర్‌ చెప్పుకొచ్చాడు. కాగా రెండో వన్డేలో ఇంగ్లండ్‌ టీమిండియా మీద 100 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ రెండో వన్డే:
వేదిక: లార్డ్స్‌, లండన్‌
టాస్‌: ఇండియా- బౌలింగ్‌
ఇంగ్లండ్‌ స్కోరు: 246 (49)
ఇండియా స్కోరు: 146 (38.5)
విజేత: ఇంగ్లండ్‌.. 100 పరుగుల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రీస్‌ టాప్లీ(9.5 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 6 వికెట్లు)

చదవండి: Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం అదే! కనీసం ఒక్కరైనా..

మరిన్ని వార్తలు