Ind Vs Eng 5th Test: అప్పుడంటే కోహ్లిని బద్నాం చేశారు.. మరి ఇప్పుడో?

1 Jul, 2022 18:46 IST|Sakshi
విరాట్‌ కోహ్లి- రవిచంద్రన్‌ అశ్విన్‌(PC: BCCI)

India Vs England 5Th Test: గతేడాది కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో టీమిండియా రీ షెడ్యూల్డ్‌ టెస్టు మ్యాచ్‌ శుక్రవారం(జూలై 1) ఆరంభమైంది. రోహిత్‌ శర్మ కోవిడ్‌ కారణాలతో జట్టుకు దూరం కాగా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉంటే.. తుది జట్టులో సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు దక్కకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా కోహ్లి ఫ్యాన్స్‌ ట్రోలర్స్‌పై విరుచుకుపడుతున్నారు. కాగా  విరాట్‌ కోహ్లి టీమిండియా కెప్టెన్‌గా ఉన్నపుడు విదేశీ గడ్డపై అశ్విన్‌కు అవకాశాలు రాకపోవడానికి అతడే కారణమని, అలాగే అప్పటి హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ప్రమేయం కూడా ఇందులో ఉందంటూ సోషల్‌ మీడియాలో కొంతమంది ట్రోల్‌ చేశారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుత రీషెడ్యూల్డ్‌ మ్యాచ్‌లో సైతం అశ్విన్‌కు చోటు దక్కని విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు ఎవరిని బ్లేమ్‌ చేస్తారు అని కోహ్లి ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. అప్పుడంటే కోహ్లి, రవిశాస్త్రిని ఆడిపోసుకున్నారు.. మరి ఇప్పుడు ఎందుకిలా అంటూ చురకలు అంటిస్తున్నారు. జట్టు అవసరాలు, పిచ్‌ వాతావరణం తదితర అంశాల ఆధారంగానే తుది జట్టులో ఆటగాడి ఎంపిక ఉంటుందని, ఇప్పటికైనా ఈ విషయం అర్థమైందా  అని ప్రశ్నిస్తున్నారు.

వాస్తవానికి ప్రస్తుత మ్యాచ్‌ జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలం. నాలుగేళ్ల కిందట అశూ ఇక్కడ ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే, రీషెడ్యూల్డ్‌ టెస్టుకు వరుణుడి ఆటంకం కలిగించే అవకాశాలున్న నేపథ్యంలో ఎక్స్‌ట్రా సీమర్‌ శార్దూల్‌తో టీమిండియా బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. 

అందుకే అశ్విన్‌ను బెంచ్‌కే పరిమితం చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా లంచ్‌ బ్రేక్‌ సమయానికే వర్షం కురవడంతో మొదటి రోజు ఆటకు బ్రేక్‌ పడింది. అప్పటికి టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 53 (53/2 (20.1)) పరుగులు చేసింది. 

చదవండి: Ind Vs Eng 5th Test: నాకు దక్కిన గొప్ప గౌరవం.. బుమ్రా భావోద్వేగం

మరిన్ని వార్తలు