Mohammed Siraj: విసిగిస్తాడు.. అతడికి బౌలింగ్‌ చేయడం కష్టం.. నిజానికి తనో యోధుడు! ఇక బుమ్రా..

4 Jul, 2022 13:22 IST|Sakshi

India Vs England 5th Test- Mohammed Siraj: ‘‘తనొక యోధుడు. ఆస్ట్రేలియాలో తానేంటో నిరూపించుకున్నాడు. ఇక్కడ కూడా అదే పునరావృతం చేస్తున్నాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి తను అండగా నిలబడతాడు. కఠిన పరిస్థితుల్లో పట్టుదలగా నిలబడి తానున్నానని ధీమా ఇస్తాడు’’ టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ నయావాల్‌ ఛతేశ్వర్‌ పుజారాపై ప్రశంసలు కురిపించాడు.

పుజారాకు బౌలింగ్‌ చేయడం చాలా కష్టమని వ్యాఖ్యానించాడు. అందుకు గల కారణాన్నీ వెల్లడించాడు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టులో భాగంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. సీమర్ల దూకుడుకు తోడు పుజారా, రిషభ్‌ పంత్‌ పట్టుదలగా ఆడటంతో బుమ్రా సేనకు 257 పరుగుల ఆధిక్యం లభించింది.

ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ అదరగొట్టాడు. 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ ఆలౌట్‌ కావడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం సిరాజ్‌ మాట్లాడుతూ తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు.

అదే విధంగా పుజారా, కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. ‘‘నిజానికి పుజారాకు బౌలింగ్‌ చేయడం కష్టం. ఎందుకంటే తను అటాక్‌ చేయడు. బంతులు వదిలేస్తూ ఉంటాడు. ఒక్కోసారి నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తుంటే విసుగు వస్తుంది. తను వారియర్‌. జట్టుకు అవసరమైనపుడు కచ్చితంగా రాణిస్తాడు’’ అని సిరాజ్‌ పేర్కొన్నాడు.

ఇక ఆటగాడిగా అయినా, కెప్టెన్‌గా అయినా బుమ్రాలో ఎలాంటి మార్పూ ఉండదని.. అన్ని వేళలా అతడు తనకు అండగా నిలబడ్డాడని సిరాజ్‌ చెప్పుకొచ్చాడు. తాను తప్పు చేసిన ప్రతిసారి వాటిని సరిదిద్ది.. ఏ పరిస్థితుల్లో ఎలా బౌల్‌ చేయాలో నేర్పించేవాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో పుజారా విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సరికి రిషభ్‌ పంత్‌తో కలిసి క్రీజులో ఉన్నాడు.

చదవండి: IND VS ENG: భువీ రికార్డు బద్ధలు కొట్టిన బుమ్రా
Ind Vs Eng: 257 పరుగుల ఆధిక్యం.. ఇంగ్లండ్‌కు కష్టమే.. టీమిండియాదే విజయం: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

మరిన్ని వార్తలు