రూట్‌ను ఔట్‌ చేయాలంటే..? సీక్రెట్‌ను రివీల్‌ చేసిన ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌

19 Aug, 2021 16:29 IST|Sakshi

లండన్: ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌ను ఎలా ఔట్‌ చేయాలో ఆ జట్టు మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్‌ వెల్లడించాడు. రూట్‌ క్రీజులోకి రాగానే బుమ్రా, సిరాజ్‌లతో ఆఫ్‌ స్టంప్‌కు ఆవల పదేపదే బౌలింగ్‌ చేయించి విసిగించాలని సూచించాడు. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల రూట్‌ ఫ్రస్ట్రేషన్‌కు లోనై వికెట్‌ పారేసుకుంటాడని పేర్కొన్నాడు. బుమ్రా, సిరాజ్‌లకు బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి తీసుకురాగల నైపుణ్యాలు అధికంగా ఉన్నాయని ప్రశంసించాడు. వీరిద్దరూ రూట్‌ను అడ్డుకోగలరని జోస్యం చెప్పాడు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పనేసర్‌ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌కు ఉన్న వీక్‌నెస్‌లను రివీల్‌ చేశాడు. రూట్‌ను ఔట్‌ చేయాలంటే ఆఫ్‌స్టంప్‌ ఆవల, ఐదో స్టంప్‌ లైన్‌లో బంతులు వేయాలని, రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఫార్ములాను అమలు చేసి సక్సెస్‌ అయ్యాడని పేర్కొన్నాడు. కోహ్లి ప్రణాళికను బుమ్రా చక్కగా అమలు చేశాడని కితాబునిచ్చాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా రూట్‌ విషయంలో ఇదే ప్రణాళికను అమలు చేస్తే టీమిండియాకు కష్టాలు తప్పినట్టేనని తెలిపాడు. రూట్‌కు బౌలింగ్‌ చేసేప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా షార్ట్‌ పిచ్‌ బంతులు వేయొద్దని సూచించాడు.

రూట్‌.. పుల్‌ షాట్‌లను అద్భుతంగా ఆడగలడు కాబట్టి, అతనికి షార్ట్‌ పిచ్‌ బంతులు వేయొద్దని సలహా ఇచ్చాడు. 39 ఏళ్ల పనేసర్ ఇంగ్లండ్ తరఫున 50 టెస్టులు, 26 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. కాగా, ఆతిథ్య జట్టులో ప్రస్తుతం కోహ్లీ సేనకు రూట్‌ పెద్ద తలనొప్పిగా మారిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో అతను ఏకంగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 386 పరుగులు(128.66 సగటు) సాధించాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్‌ లీడ్స్‌ వేదికగా ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: పంత్‌కు షాక్‌ ఇవ్వనున్న ఢిల్లీ క్యాపిటల్స్‌.. కెప్టెన్‌గా మళ్లీ అతనే..?

మరిన్ని వార్తలు