అరుదైన రికార్డు.. కపిల్‌, కుంబ్లే తర్వాత జడేజానే

6 Aug, 2021 22:12 IST|Sakshi

నాటింగ్‌హమ్‌: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో అరుదైన రికార్డ్‌ నమోదు చేశాడు. జడేజా 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతోపాటు టెస్టు క్రికెట్ చరిత్రలో 2 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన ఐదో భారత ఆల్‌రౌండర్‌గానూ రవీంద్ర జడేజా రికార్డుల్లో నిలిచాడు. ఇక మ్యాచ్‌లో జడేజా 56 పరుగులతో రాణించి కేఎల్‌ రాహుల్‌కు అండగా నిలిచాడు. కాగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. 

టెస్టు క్రికెట్‌లో 2000 పరుగులు, 200 వికెట్లు పడగొట్టిన భారత క్రికెటర్ల జాబితాని ఓసారి పరిశీలిస్తే.. దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ 5,248 పరుగులు, 434 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఉండగా.. తాజాగా వీరి సరసన రవీంద్ర జడేజా కూడా చేరాడు. ఓవరాల్‌గా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఐదో ఆల్‌రౌండర్‌గానూ రవీంద్ర జడేజా నిలిచాడు. మొదటి స్థానంలో ఇయాన్ బోథమ్ ఉండగా.. ఆ తర్వాత కపిల్‌దేవ్, ఇమ్రాన్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్ టాప్-4లో ఉన్నారు. జడేజా 53 టెస్టుల్లో ఈ మార్క్‌ని చేరుకున్నాడు.

మరిన్ని వార్తలు