వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకుని ఏం ప్రయోజనం.. వైరస్‌ మళ్లీ సోకింది

16 Jul, 2021 15:08 IST|Sakshi

లండన్‌: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌.. ఇటీవలే కరోనా బారిన పడి, ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే అతనికి కరోనా ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కరోనా సోకకముందు పంత్‌ ఎక్కడ తిరిగాడు, ఎవరెవరిని కలిశాడు అని బీసీసీఐ వర్గాలు ఆరా తీస్తుండగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూసాయి. జూన్‌ 29న పంత్‌.. వెంబ్లీ స్టేడియంలో యూరో ఛాంపియన్‌షిప్‌ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లాడు. అక్కడ మాస్క్‌ లేకుండానే అభిమానులతో సెల్ఫీలు దిగాడు. కాగా, పంత్‌ ఇక్కడే కరోనా బారినపడ్డాడని అందరూ భావించారు. 

కానీ, అతనికి చాలా గ్యాప్‌ తరువాత అంటే జులై 8న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అంటే పంత్‌కు ఫుట్‌బాల్‌ స్టేడియంలో కరోనా సోకలేదన్న విషయం స్పష్టమైంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మధ్యలో అతను జులై 5, 6 తేదీల్లో ఓ దంత వైద్యుడి సంప్రదించాడు. జులై 7న రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కూడా వేయించుకున్నాడు. ఆ మరుసటి రోజే అంటే జులై 8న అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంటే అతనికి దంత వైద్యశాలలోనే వైరస్‌ సోకి ఉండవచ్చని బీసీసీఐ ప్రాధమిక నిర్ధారణకు వచ్చింది. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నాక కూడా పంత్‌.. వైరస్‌ బారిన పడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, పంత్‌కు కరోనా డెల్టా వేరియంట్‌ వైరస్‌ సోకిందని వైద్య పరీక్షల్లో రుజువైనట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు