Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్‌ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్‌ దేవ్‌...

11 Jul, 2022 10:44 IST|Sakshi

Ind Vs Eng- Rohit Sharma Defends Virat Kohli: ఇంగ్లండ్‌ పర్యటనలోనూ టీమిండియా మాజీ కెప్టెన్‌, ‘స్టార్‌’ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పేలవ ఫామ్‌ కొనసాగుతోంది. రీషెడ్యూల్డ్‌ టెస్టులో కోహ్లి చేసిన మొత్తం పరుగులు కేవలం 31. ఇక మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి టీ20లో రాణించిన దీపక్‌ హుడాను పక్కనపెట్టి రెండు, మూడు మ్యాచ్‌లలో కోహ్లికి అవకాశం ఇచ్చారు.

అయితే, ఒకప్పటి ఈ రన్‌మెషీన్‌ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వరుసగా 1, 11 పరుగులకే పెవిలియన్‌ చేరి మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తీవ్ర స్థాయిలో విమర్శలు..
ముఖ్యంగా అతడికి ఛాన్స్‌ ఇవ్వడం కోసం ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టడం ఏమిటని టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు సైతం ఈ విషయంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం కోహ్లికి అండగా నిలబడ్డాడు.

కోహ్లి రోహిత్‌ సపోర్టు
మూడో టీ20 మ్యాచ్‌లో ఓటమి నేపథ్యంలో రోహిత్‌ స్పందిస్తూ.. ‘‘టీ20 ఫార్మాట్‌లో.. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ వంటి మేటి జట్టుపై పైచేయి సాధించాలంటే ఏం చేయాలో కోహ్లి అదే చేశాడు.

నిజం చెప్పాలంటే మేము ముగ్గురం(రోహిత్‌ శర్మ(11), రిషభ్‌ పంత్‌(1), వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(11) విఫలమయ్యాం. తప్పులను సమీక్షించుకుంటాం. ఏదేమైనా రోజు కోహ్లి ఆడిన తీరు సరైందే. అయితే, తన వ్యూహాలను పక్కాగా అమలు చేయలేకపోయాడు.

ఆఖరి వరకు నిలబడలేకపోయాడు. భారీ టార్గెట్‌ ముందున్న తరుణంలో కోహ్లి బ్యాటింగ్‌ చేసిన విధానం పట్ల అతడు సంతోషంగానే ఉంటాడు’’ అని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. కాగా మూడో టీ20లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి 6 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌ సాయంతో 11 పరుగులు చేశాడు.

కపిల్‌ దేవ్‌కు తెలియదు!
అదే విధంగా.. కోహ్లిని పక్కనపెట్టాలన్న టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ వ్యాఖ్యలను ఉద్దేశించి స్పందిస్తూ.. ‘‘ఆయన బయట నుంచి చూస్తున్నారు. జట్టులో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోవచ్చు. మా వ్యూహాలు, ఆలోచనా విధానాలు మాకుంటాయి. పటిష్ట జట్టును తయారు చేసే క్రమంలో మార్పులు చోటుచేసుకుంటాయి.

మా ఆటగాళ్లకు మేము అవకాశాలు ఇస్తాం. అయినా బయట ఎవరు ఏం మాట్లాడుతున్నారు అన్న అంశం గురించి పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. జట్టులో ఏం జరుగుతుంది అన్న దానిపైనే మా దృష్టి ఉంటుంది’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్‌ మూడో టీ20:
టాస్‌: ఇంగ్లండ్‌- బ్యాటింగ్‌
ఇంగ్లండ్‌ స్కోరు:  215/7 (20)
టీమిండియా స్కోరు: 198/9 (20)
విజేత: ఇంగ్లండ్‌.. 17 పరుగుల తేడాతో గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రీస్‌ టోప్లే(4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు)

చదవండి: Rohit Sharma: అతడు అద్భుతం.. మాకు ఇదొక గుణపాఠం.. ఓటమికి కారణం అదే!

మరిన్ని వార్తలు