Ind Vs Eng 5th Test: టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే ఇది! అతడు లేడు కాబట్టి... రోహిత్‌పై మరింత భారం!

22 Jun, 2022 13:05 IST|Sakshi
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(PC: BCCI)

India Tour of England 2022: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టు నేపథ్యంలో టీమిండియా కేఎల్‌ రాహుల్‌ సేవలను కోల్పోవడం పెద్ద ఎదురుదెబ్బేనని భారత మాజీ క్రికెటర్‌, మాజీ సెలక్టర్‌ సబా కరీం అన్నాడు. గతేడాది ఈ కర్ణాటక బ్యాటర్‌ ఇంగ్లండ్‌ గడ్డ మీద మంచి స్కోరు నమోదు చేశాడని కొనియాడాడు. అలాంటి మేటి ఆటగాడు ఇప్పుడు జట్టుకు దూరం కావడం తీరని లోటు అని పేర్కొన్నాడు.

అప్పుడు కోహ్లి సారథ్యంలో..
ఈ క్రమంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై మరింత ఒత్తిడి పెరుగుతుందని, ఓపెనర్‌గా మరింత మెరుగ్గా రాణించాల్సిన ఆవశ్యకత ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా విరాట్‌ కోహ్లి సారథ్యంలోని భారత జట్టు గతేడాది ఆగష్టులో ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో కేఎల్‌ రాహుల్‌ సెంచరీ(129)తో చెలరేగడంతో కోహ్లి సేన విజయం సాధించింది. 

ఇక మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 76 పరుగులతో విజయం సాధించగా.. నాలుగో టెస్టులో రోహిత్‌ శర్మ అద్భుత శతక ఇన్నింగ్స్‌(127) కారణంగా ఆతిథ్య జట్టుపై గెలుపొంది టీమిండియా 2-1 ఆధిక్యం సాధించింది. అయితే, కోవిడ్‌ కారణంగా ఐదో టెస్టు నిరవధికంగా వాయిదా పడగా.. ఈ ఏడాది జూలై 1న రీషెడ్యూల్‌ చేశారు.

అదరగొట్టిన ఓపెనింగ్‌ జోడి..
అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌ తర్వాత దక్షిణాఫ్రికాలో ఎదురైన పరాభవం నేపథ్యంలో విరాట్‌ కోహ్లి కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్‌ శర్మ ప్రస్తుత మ్యాచ్‌ నుంచి టీమిండియా టెస్టు జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఈ సిరీస్‌లో భారత్‌ నమోదు చేసిన విజయాల్లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ది కీలక పాత్ర అనడంలో సందేహం లేదు.


కేఎల్‌ రాహుల్‌(PC: BCCI)

రాహుల్‌ లేడు కాబట్టి..
ఈ నేపథ్యంలో సబా కరీం మాట్లాడుతూ.. ‘‘ఈ కీలక సమయంలో భారత్‌ స్టార్‌ ఆటగాడి సేవలను కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌ లేకపోవడం పెద్ద లోటు. గతేడాది టీమిండియా ఇంగ్లండ్‌ మీద గెలిచిన రెండు మ్యాచ్‌లలో అతడు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 

గెలుపులో తన వంతు సహాయం చేశాడు. కాబట్టి ఈసారి అతడి సేవలను భారత జట్టు తప్పకుండా మిస్సవుతుంది’’ అని అభిప్రాయపడ్డాడు. రాహుల్‌ స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌ రోహిత్‌తో ఓపెనింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశాడు. 

ఈసారి మరింత మెరుగ్గా..
ఇక రోహిత్‌ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘రాహుల్‌ గైర్హాజరీతో రోహిత్‌కు బాధ్యత రెట్టింపు అయింది. గతేడాది అతడు రాహుల్‌తో కలిసి భారత్‌కు శుభారంభాలు అందించాడు. ఈసారి కూడా అదే స్థాయిలో రాణించాల్సి ఉంది. ఓపెనింగ్‌ జోడి బ్యాట్‌ ఝులిపిస్తేనే టీమిండియా మంచి స్కోరు నమోదు చేయగలదు’’ అని సబా కరీం ఇండియా న్యూస్‌తో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

కాగా ఈ సిరీస్‌లో రాహుల్‌ 39.37 సగటుతో 315 పరుగులు చేయగా.. రోహిత్‌ శర్మ 368 పరుగులతో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక జూలై 1 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఐదో టెస్టు జరుగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇంగ్లండ్‌ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీసులో తలమునకలైంది.

చదవండి: Ind Vs Eng: విరాట్ కోహ్లికి కరోనా పాజిటివ్..?

మరిన్ని వార్తలు