Ind Vs Eng: ఎంత పని చేశావు జడ్డూ! పాపం సర్ఫరాజ్‌.. రోహిత్‌ శర్మ ఆగ్రహం

15 Feb, 2024 17:31 IST|Sakshi
సర్ఫరాజ్‌ను వెంటాడిన దురదృష్టం (PC: BCCI/Sports18)

India vs England, 3rd Test - Rohit sharma was not happy with Jadeja: టీమిండియా యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ను దురదృష్టం వెంటాడింది. అరంగేట్రంలోనే మెరుపు అర్ధ శతకం సాధించిన ఈ ముంబై బ్యాటర్‌ రనౌట్‌గా వెనుదిరగడం అభిమానుల హృదయాలను ముక్కలు చేసింది.

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రంజీ వీరుడు సర్ఫరాజ్‌ ఖాన్‌ .. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు సందర్భంగా ఎట్టకేలకు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. రాజ్‌కోట్‌ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఈ క్రమంలో రోహిత్‌ శర్మ(131) అవుటైన తర్వాత అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు సర్ఫరాజ్‌. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 26 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ 48 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. చక్కటి షాట్లు ఆడుతూ.. బౌండరీలు బాదుతూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అలరించాడు.

తొలుత తప్పించుకున్నాడు
రవీంద్ర జడేజాతో కలిసి రోహిత్‌ మాదిరే మంచి భాగస్వామ్యం నెలకొల్పే దిశగా పయనించాడు. కానీ.. 82వ ఓవర్లో సర్ఫరాజ్‌ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ బౌలింగ్‌లో మూడో బంతికి జడేజా ఆఫ్‌ దిశగా షాట్‌ ఆడి.. సర్ఫరాజ్‌ ఖాన్‌ను పరుగుకు పిలిచాడు.

కానీ అంతలోనే ఫీల్డర్‌ బంతిని దొరకబుచ్చుకోగా.. లక్కీగా అది స్టంప్స్‌ మిస్‌ కావడంతో అప్పటికే డైవ్‌ చేసిన సర్ఫరాజ్‌ క్రీజులోకి వచ్చాడు. అప్పటికి అలా ప్రమాదం తప్పింది. అయితే, ఆ మరుసటి రెండో బంతికే మళ్లీ సర్ఫరాజ్‌ రనౌట్‌ అయ్యాడు.

దురదృష్టం వెంటాడింది
ఆండర్సన్‌ బౌలింగ్‌లో జడ్డూ పరుగు తీసి సెంచరీ మార్కును అందుకునేందుకు సిద్ధం కాగా.. సర్ఫరాజ్‌ కూడా అతడికి సహకారం అందించేందుకు సన్నద్ధమయ్యాడు. అయితే, బంతిని గమనించిన జడేజా వెనక్కి వెళ్లగా.. అప్పటికే క్రీజు వీడిన సర్ఫరాజ్‌ వెనక్కి వచ్చేలోపే ప్రమాదం జరిగిపోయింది.

బంతిని అందుకున్న ఫీల్డర్‌ మార్క్‌ వుడ్‌ స్టంప్‌నకు గిరాటేయగా.. సర్ఫరాజ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఒకరకంగా జడ్డూ వల్ల పొరపాటు జరిగిందన్న చందంగా క్యాప్‌ తీసి నెలకేసి కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొక మంచి పార్ట్‌నర్‌షిప్‌ నిర్మిస్తారనుకుంటే నిరాశ ఎదురుకావడంతో హిట్‌మ్యాన్‌ ఇలా అసహనానికి లోనయ్యాడు.

మరోవైపు.. సర్ఫరాజ్‌ సైతం తాను రనౌట్‌ అయిన విషయాన్ని జీర్ణించుకోలేక బాధగా పెవిలియన్‌ చేరాడు. సర్ఫరాజ్‌ రనౌట్‌తో టీమిండియా డ్రెసింగ్‌రూంలో ఒక్కసారిగా గంభీర వాతావరణం నెలకొనగా.. ఆ మరుసటి బంతికే జడేజా సెంచరీ చేయడంతో కాస్త ఊరట లభించినట్లయింది. ఇక తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. జడ్డూ 110, కుల్దీప్‌ యాదవ్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

చదవండి: #Gill: మొన్న సెంచరీ.. ఇప్పుడు డకౌట్‌! ఏంటిది గిల్‌?

whatsapp channel

మరిన్ని వార్తలు