Ind Vs Eng: ఆ విషయం నాకు ముందే తెలుసు: శార్దూల్‌

7 Sep, 2021 13:00 IST|Sakshi
టీమిండియా ప్లేయర్‌ శార్దూల్‌ ఠాకూర్‌(ఫొటో: బీసీసీఐ)

లండన్‌: ఓవల్‌ మైదానంలో టీమిండియా చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన భారత క్రికెటర్‌ శార్దూల్‌ ఠాకూర్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. నాలుగో టెస్టులో రెండు హాఫ్‌ సెంచరీలు, మూడు వికెట్లతో రాణించిన అతడి ప్రతిభను క్రీడా ప్రముఖులు, అభిమానులు కొనియాడుతున్నారు. నిజానికి, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ శార్దూల్‌నే వరించాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ అవార్డు అందుకున్న హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇక... ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ దిగి ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు అర్థ శతకాలు సాధించిన నాలుగో టీమిండియా బ్యాట్స్‌మన్‌గా శార్దూల్‌ ఠాకూర్‌ తన పేరిట రికార్డు లిఖించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి అతడు బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. ‘‘చాలా గొప్పగా అనిపిస్తోంది. జట్టు విజయంలో నాదైన పాత్ర పోషించాలని, నా ముద్ర వేయాలని ముందే ప్లాన్‌ చేసుకున్నాను. 

అందుకు తగ్గట్టుగానే.. ఐదో రోజు ఫలితం నా సంతోషాన్ని పరిపూర్ణం చేసింది. వంద కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు తీయడం చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉందని తెలుసు. నెట్స్‌లో ప్రాక్టీసు​ చేసేటపుడు ఎన్నోసార్లు బ్యాటింగ్‌ చేశాను కూడా. ఇప్పుడైతే నేను హ్యాపీ’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. 

కాగా నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 36 బంతులు ఎదుర్కొని 57 పరుగులు(7 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి, ఒక వికెట్‌(ఓలీ పోప్‌) తీసిన శార్దూల్‌ ఠాకూర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 72 బంతుల్లో 60 పరుగులు(7 ఫోర్టు, ఒక సిక్సర్‌) చేసి, రోరీ బర్న్స్', జో రూట్‌ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఓవల్‌ టెస్టులో 157 పరుగులతో కోహ్లి సేన ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

టీమిండియా స్కోరు:
తొలి ఇన్నింగ్స్‌: 191-10 (61.3 ఓవర్లు)
రెండో ఇన్నింగ్స్‌: 466-10 (148.2 ఓవర్లు)

ఇంగ్లండ్‌ స్కోరు:
తొలి ఇన్నింగ్స్‌: 290-10 (84 ఓవర్లు)
రెండో ఇన్నింగ్స్‌: 210-10 (92.2 ఓవర్లు)

చదవండిVirat Kohli Winning Words: ఇలాంటి విజయం ఊహించలేదు.. మా కుర్రాళ్లు అద్భుతం

మరిన్ని వార్తలు