అవును.. లార్డ్స్ ఆండ‌ర్సన్ అడ్డానే.. కోహ్లికి కౌంటరిచ్చిన బ్రాడ్‌

16 Aug, 2021 16:43 IST|Sakshi

లండ‌న్: భారత్‌, ఇంగ్లండ్ జట్ల మ‌ధ్య లార్డ్స్‌ వేదికగా జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్ ఆండ‌ర్సన్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే. నాలుగోరోజు ఆట‌లో భాగంగా ఆండ‌ర్సన్‌ పలు మార్లు పిచ్‌పై పరిగెత్తడమే కాకుండా కోహ్లిని క‌వ్వించేలా మాట్లాడాడు. దీనికి విరాట్ త‌న‌దైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. "పిచ్‌ నీ సొంతం అనుకున్నావా.. పరిగెత్తడానికి'' అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అయితే, కోహ్లి-ఆండర్సన్‌ల మధ్య జరిగిన వాగ్వాదంపై ఇంగ్లండ్ మ‌రో పేసర్‌ స్టువ‌ర్ట్ బ్రాడ్ స్పందించాడు. ఈ విషయమై కోహ్లికి కౌంట‌రిస్తూ.. అవును, లార్డ్స్ ఆండ‌ర్సన్ అడ్డానే. కావాలంటే అక్కడి హానర్‌ బోర్డు చూడు.. లార్డ్స్‌ ఆండర్సన్‌ అడ్డా అని గణంకాలే చెబుతాయి. కోహ్లి.. నీలోని ఫైర్ బాగుంటుంది కానీ, నువ్వు వాడే భాషే నిన్ను క‌ష్టాల్లో ప‌డేస్తుంది అంటూ బ్రాడ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

కాగా, ఆండర్సన్‌ లార్డ్స్‌ మైదానంలో 5 వికెట్ల ఘనతను ఏడు సార్లు సాధించాడు. ఈక్రమంలో అతను ఇంగ్లండ్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌ రికార్డును(7 సార్లు 5 వికెట్ల ఘనత) సమం చేశాడు. ఇదిలా ఉంటే, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. రిషభ్‌ పంత్‌ (14 బ్యాటింగ్‌), ఇషాంత్‌ శర్మ (4 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 154 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 
చదవండి: నరాలు తెగే ఉత్కంఠత.. రోచ్ 'సూపర్' ఇన్నింగ్స్‌తో గట్టెక్కిన విండీస్‌

మరిన్ని వార్తలు