టీమిండియాకు మరో ఎదురుదెబ్బ

1 Feb, 2024 18:30 IST|Sakshi

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ఈ సిరీస్‌కు దూరమవుతున్నారు. తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన (కండరాల సమస్య) స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మూడో టెస్ట్‌కు కూడా దూరం కానున్నాడని ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ క్రిక్‌బజ్‌ పేర్కొంది.

జడ్డూ గాయం చాలా తీవ్రమైందని, దాని నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని తెలిపింది. జడ్డూ ఒకవేళ రాం​చీలో జరిగే నాలుగో టెస్ట్‌ (ఫిబ్రవరి 23-27) సమయానికి కోలుకుంటే అది అద్భుతమే అవుతుందని వివరించింది. మరోవైపు మూడో టెస్ట్‌ నుంచి అందుబాటులో ఉంటాడనుకున్న స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని తెలుస్తుంది.

విరాట్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడంటూ కథనాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మూడు, నాలుగు, ఐదు టెస్ట్‌ల కోసం టీమిండియాను నిన్ననే (జనవరి 31) ప్రకటించాల్సి ఉండింది. అయితే విరాట్‌ నుంచి ఎలాంటి కబురు రాకపోవడంతో  సెలెక్టర్లు మౌనంగా ఉండిపోయారు. ఇంకోవైపు స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ గాయానికి సంబంధించి కూడా బీసీసీఐ వద్ద ఎలాంటి అప్‌డేట్‌ లేదని తెలుస్తుంది.

తొలి టెస్ట్‌లో ఓటమి నేపథ్యంలో షమీ మూడో టెస్ట్‌ నుంచైనా జట్టుకు అందుబాటులో ఉంటాడని అభిమానులు భావించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే షమీ సిరీస్‌ మొత్తానికే అందుబాటులో వచ్చేలా లేడు. ప్రస్తుతం షమీ చికిత్స నిమిత్తం లండన్‌లో ఉన్నాడు. ఇన్ని నెగిటివ్స్‌ మధ్య టీమిండియాకు ఓ ఊరట కలిగించే వార్త వినిపిస్తుంది. తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడిన మరో ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ మూడో టెస్ట్‌ నుంచి అందుబాటులోకి వస్తాడని ఎన్‌సీఏ వర్గాల సమాచారం.

రాహుల్‌ గాయం చాలా చిన్నదని, త్వరలో అతను జట్టుతో చేరతాడని ఎన్‌సీఏకి చెందిన కీలక వ్యక్తి ఒకరు మీడియాకు తెలిపారు. ఇన్ని ప్రతికూలతల నడుమ ఈ సిరీస్‌లో టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. 

కుర్రాళ్లు ఏం చేస్తారో..?
గాయపడిన  కీలక ఆటగాళ్ల స్థానాలను యువ ఆటగాళ్లతో భర్తీ చేసిన సెలెక్టర్లు వారి నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఆశిస్తున్నారు. అయితే రెండో టెస్ట్‌లో రాహుల్‌, విరాట్‌లకు ప్రత్యామ్నాయాలైన రజత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌లకు ఇప్పటివరకు టెస్ట్‌ క్రికెట్‌ ఆడిన అనుభవం లేకపోవడం అభిమానులను కలవరపెడుతుంది. తొలి టెస్ట్‌లో ఓటమిపాలై సిరీస్‌లో వెనుకపడిపోయిన భారత్‌ ఇన్ని ప్రతికూలతల కారణంగా డిఫెన్స్‌ పడినట్లు కనిపిస్తుంది.

మరోవైపు రెండో టెస్ట్‌కు వేదిక అయిన వైజాగ్‌ స్పిన్నర్లకు అనుకూలించనుందని అంచనా వేస్తున్న భారత్‌.. ఈ మ్యాచ్‌లో భారీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుందని టాక్‌ వినిపిస్తుంది. ఇదే జరిగితే టీమిండియా బుమ్రా ఒక్కడితో బరిలోకి దిగి సిరాజ్‌ను బెంచ్‌కు పరిమితం చేస్తుంది. భారత క్రికెట్‌కు సంబంధించి ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగిన సందర్భాలు చాలా తక్కువ.

whatsapp channel

మరిన్ని వార్తలు