IND Vs ENG: కోహ్లీ సేనకు భారీ షాక్‌.. యువ ఆల్‌రౌండర్‌ దూరం..?

22 Jul, 2021 16:45 IST|Sakshi

డర్హమ్: ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ సేనను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కాలి గాయంతో సిరీస్‌ నుంచి అర్దంతరంగా వైదొలగగా, బుధవారం స్టాండ్ బై బౌలర్ ఆవేశ్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. తాజాగా ఈ జాబితాలో యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా చేరాడు. టీమిండియాతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్‌ ఎలెవెన్‌ తరఫున బరిలోకి దిగిన సుందర్‌.. గురువారం ఆటలో గాయపడినట్లు సమాచారం. అతని చేతి వేలికి గాయమైందని, అయితే గాయం తీవ్రతపై స్పష్టత లేదని, స్కానింగ్‌ తీసిన తర్వాతే గాయంపై క్లారిటీ వస్తుందని ప్రముఖ వార్తా సంస్థ పేర్కొంది.

గాయంతో సుందర్‌ పడుతున్న ఇబ్బంది చూస్తే.. వేలు విరిగినట్లు అర్థమవుతుందని సదరు సంస్థ తెలిపింది. ఇదే జరిగితే ఇంగ్లండ్‌ టూర్‌ నుంచి ఈ యువ ఆల్‌రౌండర్‌ తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు సన్నాహకంగా కౌంటీ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజు వార్మప్‌ మ్యాచ్‌లో అవేశ్ ఖాన్‌తో పాటు వాషింగ్టన్‌ సుందర్ గాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో కౌంటీ సెలెక్ట్‌ ఎలెవన్‌ తరఫున అవేశ్‌ ఖాన్‌, సందర్ బరిలోకి దిగారు. ఆ జట్టులోని ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో ఈ ఇద్దరు బరిలోకి దిగాల్సి వచ్చింది.

అయితే తొలి రోజు ఆటలో ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ను అవేశ్‌ ఖాన్‌ బౌలింగ్‌ చేయగా.... విహారి కొట్టిన రిటర్న్‌ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అతని ఎడమ చేతి బొటన వేలుకు గాయమైంది. స్కానింగ్‌లో అవేశ్‌ ఖాన్ వేలు విరిగినట్లు తేలింది. అతను కోలుకోవడానికి కనీసం నెల రోజులకు పైగా సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. దీంతో అతని ఇంగ్లండ్ పర్యటన అర్థంతరంగా ముగిసింది. తాజాగా సుందర్ సైతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. కాగా, 24 మంది సభ్యుల జట్టులో ముగ్గురు ఆటగాళ్లు గాయాల బారిన పడటం కోహ్లీ సేనను కలవరపెడుతోంది. మరోవైపు శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీషా, దేవదత్ పడిక్కల్‌ను ఇంగ్లండ్‌కు పంపాలని కోహ్లీ సేన చేసిన విజ్ఞప్తిని సెలెక్టర్లు తిరస్కరించిన విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు