వసీం చెప్పింది అదేనా.. ఆ ముగ్గురినే తీసుకోమంటున్నాడా!

27 Mar, 2021 20:55 IST|Sakshi
టీమిండియా ఆటగాళ్లు(ఫొటో కర్టెసీ: రాయిటర్స్‌)

పుణె: టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే పుణె వేదికగా ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది.. విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని కోహ్లి సేన భావిస్తుండగా, ఈ ఒక్క సిరీస్‌లోనైనా గెలుపొంది పరువు నిలుపుకోవాలని పర్యాటక జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఇక తొలి వన్డేలో 66 పరుగులతో టీమిండియా విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొంది ఇంగ్లండ్ అంతకంతకు అంతా బదులు తీర్చుకోవడంతో సిరీస్‌ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో మూడో వన్డేపై క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో టీమిండియా జట్టు కూర్పు విషయమై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘శుభోదయం కోహ్లి. ఒక ఫొటో నీ ఉదయాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది. అవును, ఇది నిజం. రేపటి మ్యాచ్‌కు నీకు గుడ్‌ లక్‌’’ అంటూ ఓ ఫొటోను షేర్‌ చేశాడు. అందులో.. ‘‘న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లో గల గ్రీన్‌విచ్‌ గ్రామంలో ఉన్న వాషింగ్టన్‌ స్క్వేర్‌ పార్కులో వాలిపోతున్న పొద్దులో చెస్‌ ఆటగాళ్లు ఇదిగో ఇలా కూర్చున్నారు’’ అని రాసి ఉంది.

ఈ క్రమంలో, యజువేంద్ర చహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకోవాల్సిందిగా వసీం సూచిస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో మీ నర్భగర్భ సందేశం సూపర్‌ అంటూ వసీం చతురతను ప్రశంసిస్తున్నారు. ఈ ముగ్గురి పేర్లే అని ఎందుకు భావిస్తున్నారంటే.. చహల్‌ క్రికెటర్‌ అవడానికి ముందు చెస్‌ ప్లేయర్‌గా ఉండేవాడు.

ఇక వాషింగ్టన్‌ పార్కు, సన్‌ ప్రస్తావన ద్వారా వాషింగ్టన్‌ సుందర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్లను గుర్తు చేశాడనుకోవచ్చు. కాగా రెండో వన్డేలో కుల్దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌ను ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ చీల్చి చెండాడిని విషయం తెలిసిందే. దీంతో మూడో మ్యాచ్‌లో వీరిద్దరి స్థానంలో చహల్‌, సుందర్‌ను తీసుకునే అవకాశం లేకపోలేదు. ఎటొచ్చీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మెరుగ్గా రాణిస్తున్నందు వల్ల సూర్యకుమార్‌కు మాత్రం నిరాశ తప్పకపోవచ్చు!

చదవండి: కోహ్లి... పూర్‌ కెప్టెన్సీ; ఇలా అయితే వరల్డ్ కప్‌లో..‌

మరిన్ని వార్తలు