Ind Vs Eng 5th Test: వాళ్లేమో అదరగొడుతున్నారు.. వీళ్లేమో ఇలా.. ఛాన్స్‌ ఇస్తే జట్టులో పాతుకుపోవాలి! కానీ..

4 Jul, 2022 10:32 IST|Sakshi
హనుమ విహారి- శుబ్‌మన్‌ గిల్‌(PC: ECB)

గిల్‌, విహారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారన్న టీమిండియా మాజీ బ్యాటర్‌

India vs England 5th Test: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ గైర్హాజరీ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. అదే విధంగా చాలా కాలం తర్వాత తెలుగు క్రికెటర్‌ హనుమ విహారికి కూడా ఈ మ్యాచ్‌లో భాగంగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే, వీరిద్దరూ తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు.

మొదటి ఇన్నింగ్స్‌లో గిల్‌ 17 పరుగులకు అవుట్‌ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహాలో పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విహారి సైతం వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేశాడు.

ఇలా ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో వీరిద్దరు విఫలం కావడంపై టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ స్పందించాడు. రంజీల్లో అదరగొట్టిన సర్ఫరాజ్‌ ఖాన్‌ వంటి యువ ఆటగాళ్లు జట్టులో పోటీకి వస్తున్న తరుణంలో వచ్చిన అవకాశాన్ని వీరిద్దరు ఉపయోగించుకోలేకపోయారని పెదవి విరిచాడు.

మంచి ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నారు..
ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో షోలో వసీం జాఫర్‌ మాట్లాడుతూ.. ‘‘గిల్‌, విహారి మంచి ఛాన్స్‌ మిస్‌ చేసుకున్నారనే చెప్పాలి. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ వంటి ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తారు. అదే విధంగా సర్ఫరాజ్‌ ఖాన్‌ వంటి యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో టీమిండియా తలుపులు తడుతున్నారు.

ఇక సూర్యకుమార్‌ యాదవ్‌ సైతం పోటీలో ఉన్నాడు. ఇలాంటపుడు వీరిద్దరు ఇలా నిరాశపరిచి జట్టులో పాతుకుపోయే అవకాశాన్ని కోల్పోయినట్లే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఇంగ్లండ్‌ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. జానీ బెయిర్‌ స్టో ఒక్కడిపైనే ఆధారపడితే కష్టమని.. జో రూట్‌, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ కూడా బ్యాట్‌ ఝులిపించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు.

కాగా ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో భాగంగా టీమిండియా ఆదివారం(జూలై 3) మూడో రోజు ఆట ముగిసే సమయానికి  రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు కంటే 257 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

ఇండియా వర్సెస్‌ ఇంగ్లండ్‌ ఐదో టెస్టు స్కోర్లు:
►టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 416 ఆలౌట్‌
►ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 284 ఆలౌట్‌
►టీమిండియా రెండో ఇన్నింగ్స్‌: మూడో రోజు ఆట ముగిసే సమయానికి 125/3 (45).
చదవండి: ENG vs IND: కోహ్లి, బెయిర్‌ స్టో మధ్య మాటల యుద్దం.. వీడియో వైరల్‌..!

మరిన్ని వార్తలు