Virat Kohli Vs Jonny Bairstow: కావాలని రెచ్చగొడితే ఇదిగో ఇలాగే ఉంటది మరి?

4 Jul, 2022 16:02 IST|Sakshi

ఉద్దేశపూర్వకంగా ఎదుటి వ్యక్తులను రెచ్చగొడితే ఒక్కోసారి మనమే చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని టీమిండియా మాజీ బ్యాటర్‌ వసీం జాఫర్‌ అన్నాడు. స్లెడ్జింగ్‌ ఒక్కోసారి బ్యాక్‌ఫైర్‌ అవుతుందంటూ భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో కోహ్లి, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌ స్టో మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అప్పటివరకు ఆచితూచి ఆడిన బెయిర్‌ స్టో కోహ్లి తన నవ్వు, మాటలతో కవ్వించడంతో దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 140 బంతుల్లోనే 106 పరుగులు పూర్తి చేశాడు. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో రాణించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ కోహ్లిపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ‘‘నిజంగానే కోహ్లి స్లెడ్జింగ్‌ బెయిర్‌ స్టో దూకుడుకు కారణమైందా? అంటే అవుననే చెప్పొచ్చు. అంతవరకు జాగ్రత్తగా నెమ్మదిగా ఆడిన బెయిర్‌ స్టో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. నిజానికి ఒకరిని కావాలని రెచ్చగొడితే ఒక్కోసారి మనకే బ్యాక్‌ఫైర్‌ అవుతుంది. ఏమో స్లెడ్జింగ్‌కు బదులిచ్చే క్రమంలో బెయిర్‌ స్టో మరింత దూకుడు ప్రదర్శించాడేమో?’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉంటే.. భారత బౌలింగ్‌ విభాగంపై జాఫర్‌ ప్రశంసలు కురిపించాడు. ‘‘ఇరు జట్ల బ్యాటర్లు మెరుగ్గానే రాణించారు. అయితే, భారత బౌలర్లు విజృంభించడం టీమిండియాకు కలిసొచ్చింది. సిరాజ్‌, బుమ్రా, షమీ అద్భుతంగా ఆడారు. ఇంగ్లండ్‌ను 284 పరుగులకే కట్టడి చేశారు’’ అని కితాబిచ్చాడు. కాగా బుమ్రా 3, షమీ 2, సిరాజ్‌ 4, శార్దూల్‌ ఠాకూర్ ఒక వికెట్‌తో రాణించడంతో 284 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. 

చదవండి: Mohammed Siraj: విసిగిస్తాడు.. అతడికి బౌలింగ్‌ చేయడం కష్టం.. నిజానికి తనో యోధుడు! ఇక బుమ్రా..

మరిన్ని వార్తలు