#Jasprit Bumrah: బూమ్‌ బూమ్‌ బుమ్రా సరికొత్త చరిత్ర.. భారత తొలి బౌలర్‌గా..

3 Feb, 2024 17:13 IST|Sakshi

India vs England, 2nd Test- #Bumrah: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు సందర్భంగా టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. వైజాగ్‌ మ్యాచ్‌లో శనివారం నాటి ఆటలో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ ఫాస్ట్‌బౌలర్‌.. అంతర్జాతీయ టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.

అంతేకాదు.. అతి తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించిన భారత తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌(47)ను అవుట్‌ చేసి బుమ్రా ఈ ఫీట్‌ నమోదు చేశాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో తన అద్భుత నైపుణ్యాలతో ఆకట్టుకున్న పేస్‌ గుర్రం బుమ్రా.. మొత్తంగా ఆరు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రెండో రోజు ఆటలో భాగంగా జో రూట్‌తో వికెట్ల వేట మొదలుపెట్టిన బుమ్రా.. తర్వాత ఒలీ పోప్‌, జానీ బెయిర్‌ స్టో, బెన్‌ స్టోక్స్‌, టామ్‌ హార్లీలను కూడా అవుట్‌ చేసి.. జేమ్స్‌ ఆండర్సన్‌తో ముగించాడు. 

ఇతర బౌలర్లలో స్పిన్నర్లు కుల్దీప్‌ యాదవ్‌ మూడు, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీయగా.. ఇంగ్లండ్‌ 253 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన టీమిండియా ఆట పూర్తయ్యేసరికి 5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.

ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ 15, రోహిత్‌ శర్మ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక అంతకుముందు టీమిండియా 396 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ముగించిన విషయం తెలిసిందే.  

అంతర్జాతీయ టెస్టుల్లో... తక్కువ బంతుల్లోనే 150 వికెట్ల క్లబ్‌లో చేరిన భారత బౌలర్లు
6781 బాల్స్‌- జస్‌ప్రీత్‌  బుమ్రా
7661 బాల్స్‌- ఉమేశ్ యాదవ్
7755 బాల్స్‌- మహ్మద్ షమీ
8378 బాల్స్‌- కపిల్ దేవ్
8380 బాల్స్‌- రవిచంద్రన్‌ అశ్విన్ 

చదవండి: ఇలాంటి బాల్‌ ఎలా ఆడాలి బుమ్రా?.. స్టోక్స్‌ బౌల్డ్‌.. రియాక్షన్‌ వైరల్‌

whatsapp channel

మరిన్ని వార్తలు