పింక్‌ బాల్‌ టెస్టు అప్‌డేట్స్‌: టీమిండియా స్కోరు 99/3

24 Feb, 2021 22:27 IST|Sakshi

ముగిసిన తొలిరోజు ఆట
పింక్‌ బాల్‌ టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 57 పరుగులతో, అజింక్య రహానే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా మూడో టెస్టు తొలిరోజు ఆటలో టీమిండియా అన్ని సెషన్లలోనూ ఆధిపత్యం చలాయించింది. మొదట బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ ఆధిపత్యం కనబరిచింది.

ఓపెనర్‌ గిల్‌, పుజారాలు ఔటైనా మరో ఓపెనర్‌ రోహిత్‌ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బౌండరీ బాది అర్థ శతకం సాధించాడు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రోహిత్‌కు సహకారమందించడంతో జట్టు స్కోరులో వేగం పెరిగింది. రోహిత్‌, కోహ్లి మూడో వికెట్‌కు 60 పరుగులు జతచేశారు. వీరిద్దరి జోడి బలపడుతున్న క్రమంలో 27 పరుగులు చేసిన కోహ్లి జాక్‌ లీచ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రహానే మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడడంతో 3 వికెట్ల నష్టానికి 99 పరుగుల వద్ద తొలి రోజు ఆటను ముగించింది. ఇంగ్లండ్‌ కంటే ఇంకా 13 పరుగులు మాత్రమే వెనుకబడి ఉన్న భారత్‌ రెండో రోజు ఆటలో భారీ స్కోరు చేస్తుందా లేక ఇంగ్లీష్‌ బౌలర్ల ముందు తలవంచుతుందా అనేది చూడాలి.

రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ
టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పింక్‌ బాల్‌ టెస్టులో అర్థ శతకం సాధించాడు. బెన్‌ స్టోక్స్‌ వేసిన 24 ఓవర్‌ 5వ బంతికి సింగిల్‌ తీసిన రోహిత్‌ 63 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో టెస్టు కెరీర్‌లో 12వ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా 25 ఓవర్లలో 83 పరుగులు చేసింది. కోహ్లి 19, రోహిత్‌ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు.

గిల్‌. పుజారా ఔట్‌
టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్సోయింది.  శుబ్‌మన్‌ గిల్‌(11), చతేశ్వర్‌ పుజారా(0)ల వికెట్లను వరుస ఓవర్లలో టీమిండియా చేజార్చుకుంది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన 15 ఓవర్‌ చివరి బంతికి గిల్‌ ఔట్‌ కాగా, ఆపై వచ్చిన పుజారా సైతం నిరాశపరిచాడు. స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ ఐదో బంతికి పుజారా వికెట్లు ముందు దొరికిపోయాడు. నాలుగు బంతులు ఆడిన పుజారా పరుగులేమీ చేయకుండా ఎల్బీగా ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. రోహిత్‌ 31 పరుగులు, కోహ్లి 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

నత్తనడకన టీమిండియా ఇన్నింగ్స్‌
పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ నత్తనడకన సాగుతుంది. ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతుండడంతో టీమిండియా ఆచితూచి ఆడుతుంది. పిచ్‌ ఎలా ఉంటుందో అర్థం కాక బ్యాట్స్‌మెన్‌ పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం టీమిండియా  13 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. రోహిత్‌ 21 పరుగులు, గిల్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో సెషన్‌ విరామం.. టీమిండియా స్కోరు 5/0
మూడో టెస్టు తొలిరోజు ఆటలో రెండో సెషన్‌ విరామ సమయానికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 5 పరుగులు చేసింది. ఓపెనర్లె రోహిత్‌ శర్మ 5 పరుగులు, శుబ్‌మన్‌ గిల్‌ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా అంతకముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. ఆట తొలిరోజులో భాగంగా రెండు సెషన్లలోనూ టీమిండియా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. అయితే పిచ్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటుండడంతో  చివరి సెషన్‌లో భారత బ్యాటింగ్‌ ఏ విధంగా కొనసాగుతుందో చూడాలి.

112 పరుగులకు ఇంగ్లండ్‌ ఆలౌట్‌
పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్ 38 పరుగులకే ఆరు వికెట్లు తీసి టెస్టు కెరీర్‌లో‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఓపెనర్‌ జాక్‌ క్రావ్లే(53) మినహా మిగతా ఏ బ్యాట్స్‌మెన్‌ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్‌ 6 వికెట్లు తీయగా.. అశ్విన్‌ 3, ఇషాంత్‌ ఒక వికెట్‌ తీశాడు.

విజృంభిస్తున్న టీమిండియా స్పిన్నర్లు
‌ఇంగ్లండ్‌ జట్టు తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ వేసిన 46వ ఓవర్‌ మూడో బంతికి స్టువర్ట్‌ బ్రాడ్‌ బుమ్రాకు క్యాచ్‌ ఇవ్వడంతో 106 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. కాగా అక్షర్‌ పటేల్‌ బ్రాడ్‌ వికెట్‌ ద్వారా వరుసగా రెండోసారి 5 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ తన డబ్యూ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్‌ 98 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. అ‍శ్విన్‌ వేసిన 37వ ఓవర్‌ 3వ బంతిని జాక్‌ లీచ్‌ ఫ్లిక్‌ చేయగా.. స్లిప్‌లో ఉన్న పుజారా ఒడిసి పట్టకున్నాడు. అయితే పుజారా క్యాచ్‌ అందుకునే క్రమంలో చేతి వేళ్లు గ్రౌండ్‌ను తాకాయన్న అనుమానంతో ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌ను ఆశ్రయించాడు. పుజారా అందుకున్న క్యాచ్‌ను పలు యాంగిల్స్‌లో చూసిన థర్డ్‌ అంపైర్‌ అవుట్‌గా ప్రకటించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఆలౌట్‌కు ఇంకా రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 8 వికెట్లకు 100 పరుగులు సాధించింది. క్రీజులో బ్రాడ్‌(2), ఫోక్స్‌(3) తో క్రీజులో ఉన్నారు.

పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా స్పిన్నర్ల దాటికి ఇంగ్లండ్ విలవిలలాడుతోంది. పిచ్‌పై అనూహ్యంగా తిరుగుతున్న బంతిని ఆడలేక ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లు తడబడుతున్నారు. తాజాగా అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఆర్చర్‌ క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ 93 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయింది. దాంతో వందలోపే ఏడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ తీవ్ర కష్టాల్లో పడింది. అక్షర్‌ పటేల్‌ నాలుగు వికెట్లతో చెలరేగుతుండగా... మరో స్పిన్నర్‌ అశ్విన్‌ రెండు వికెట్లు తీశాడు.‌ 

టీమిండియా బౌలర్ల ఉచ్చులో పడిన ఇంగ్లండ్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. అక్షర్‌ పటేల్‌ వేసిన 28వ ఓవర్‌ 5వ బంతికి స్టోక్స్‌ ఎల్బీగా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ 81 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ స్కోరు 6 వికెట్ల​ నష్టానికి 86 పరుగులుగా ఉంది. అంతకముందు తొలి సెషన్‌ విరామం అనంతరం తొలి ఓవర్‌లోనే  ఓలీ పోప్‌ రూపంలో ఐదో వికెట్‌ను కోల్పోయింది. అశ్విన్‌ వేసిన 27వ ఓవర్‌ నాలుగో బంతి పోప్‌ హిట్‌ చేసే ప్రయత్నం చేయగా.. బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్షర్‌ పటేల్‌ 3, అశ్విన్‌ ‌ 2 వికెట్లు తీశారు. 

తొలి సెషన్‌ విరామం: ఇంగ్లండ్‌ స్కోరు 81/4
పింక్‌ బాల్‌ టెస్టులో మొదటిరోజు ఆటలో తొలి సెషన్‌లో టీమిండియా ఆదిపత్యం ప్రదర్శించింది. తొలి సెషన్‌ విరామ సమయానికి ఇంగ్లండ్‌ 27వ ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. స్టోక్స్‌ 6, ఓలీ పోప్‌ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. కాగా మొదటి సెషన్‌ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ ఓపెనర్‌ సిబ్లీని డకౌట్‌ చేసిన ఇషాంత్‌ టీమిండియాకు శుభారంబాన్ని అందించాడు. అనంతరం అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో జానీ బెయిర్‌ స్టో కూడా సున్నా పరుగులకే  ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత రూట్‌, క్రావ్లేలు కలిసి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేశారు. అయితే మొదటి సెషన్‌ విరామానికి ముందు ఇంగ్లండ్‌ వరుసగా రూట్‌ , క్రావ్లే వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లు తీయగా.. ఇషాంత్‌ , అశ్విన్‌ చెరొక వికెట్‌ తీశారు.

కీలక వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
53 పరుగులతో నిలకడగా ఆడుతున్న జాక్‌ క్రావ్లే అక్షర్‌ బౌలింగ్‌ అవుటవడంతో ఇంగ్లండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 25 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. స్టోక్స్‌ 6, ఓలీ పోప్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

రూట్‌ అవుట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు మరో వికెట్‌ కోల్పోయింది. 17 పరుగులు చేసిన కెప్టెన్‌ జో రూట్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్‌ 74 పరుగుల వద్ద మూడో వికెట్‌ నష్టపోయింది. అశ్విన్‌ వేసిన బంతి రూట్‌ ప్యాడ్లను తాకుతూ లెగ్‌ స్టంప్‌ మీదుగా వెళ్లింది. టీమిండియా అప్పీల్‌ చేయగా అంపైర్‌ అవుటిచ్చాడు. అయితే రూట్‌ రివ్యూకు వెళ్లగా అతనికి నిరాశ ఎదురైంది. 

ఓపెనర్‌ క్రాలీ అర్థ సెంచరీ.. నిలకడగా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌
ఇంగ్లండ్‌ ఓపెనర్‌ క్రావ్లే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను క్రావ్లే, రూట్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్నారు. ఈ దశలో అక్షర్‌ పటేల్‌ వేసిన 18వ ఓవర్‌లో మూడో బంతిని ఫోర్‌ కొట్టిన క్రావ్లే కెరీర్‌లో నాలుగో అర్థ శతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టు 20 ఓవర్లలో  రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.క్రావ్లే  52, రూట్‌ 11 పరుగులతో ఆడుతున్నారు.

50 పరుగులు పూర్తి చేసుకున్న ఇంగ్లండ్‌
పింక్‌ బాల్‌ టెస్టులో ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ 13వ ఓవర్లో 50 పరుగులు పూర్తి చేసుకుంది. ఓపెనర్‌ సిబ్లీతో పాటు జానీ బెయిర్‌ స్టో సున్నా పరుగులకే వెనుదిరిగినా.. తర్వాత వచ్చిన కెప్టెన్‌ రూట్‌తో కలిసి మరో ఓపెనర్‌ జాక్‌ క్రావ్లే వికెట్‌ పడకుండా నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం 15 ఓవర్లలో 53 పరుగులు చేసింది.క్రావ్లే 40, రూట్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌
టీమిండియాతో జరుగుతున్ను పింక్‌బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ వేసిన 6వ ఓవర్‌ మొదటి బంతి జానీ బెయిర్‌ స్టో ప్యాడ్లను తాకుతూ వెళ్లింది. టీమిండియా ఎల్బీ అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ నితిన్‌ మీనన్‌ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బెయిర్‌ స్టో రివ్యూకి వెళ్లగా.. రిప్లేలో బంతి ఇంపాక్ట్‌ మిడిల్‌ స్టంప్‌పైకి వెళుతున్నట్లు కనిపించడంతో థర్డ్‌ అంపైర్‌ అవుట్‌ ఇచ్చాడు. దీంతో ఇంగ్లండ్‌ 27 పరుగులు వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. జాక్‌ క్రావ్లే 23, జో రూట్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆదిలోని ఇంగ్లండ్‌ షాక్‌
బ్యాటింగ్‌ ప్రారంభించిన కాసేపటికే ఇంగ్లండ్‌కు షాక్‌ తగిలింది. ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లే ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరాడు. ఇషాంత్‌ శర్మ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవరలో సిబ్లే ఔటయ్యాడు. ఆ ఓవర్‌ మూడో బంతికి రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చాడు. ఏడు బంతులు ఆడిన సిబ్లే డకౌట్‌గా పెవిలియన్‌ చేరగా, ఇంగ్లండ్‌ స్కోర్‌ బోర్డుపై‌ రెండు పరుగులే ఉన్నాయి.

అహ్మదాబాద్‌: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ ముందుగా బ్యాటింగ్‌ చేయడానికి మొగ్గుచూపాడు. ఇప్పటికే ఇరుజట్లు తలో టెస్టు మ్యాచ్‌ గెలిచి సమంగా ఉన్నందున ఈ మ్యాచ్‌  కీలకంగా మారింది.  కొత్తగా పునర్నిర్మించిన సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్‌ మూడో టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యే క్షణం భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయం కానుంది. ఇక్కడ చదవండి: ‘మహా’ సమరానికి సై


ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ మైదానంగా వార్తల్లో నిలిచిన అహ్మదాబాద్‌ వేదికపై ఒక హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్‌ సమంగా నిలిచిన ప్రస్తుత స్థితిలో ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరువవుతుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. సిరాజ్‌ స్థానంలో బుమ్రాను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఇక కుల్దీప్‌ యాదయ్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ వచ్చాడు. ఇంగ్లండ్‌ జట్టులోకి బెయిర్‌ స్టో, అండర్సన్‌లు తిరిగి జట్టులోకి వచ్చారు.  ఇ‍క్కడ చదవండి: మొతేరా క్రికెట్‌ స్టేడియం : బిగ్‌ సర్‌ప్రైజ్‌

భారత్‌ తుది జట్టు
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజారా, అజ్యింకా రహానే, రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మ, బుమ్రా

ఇంగ్లండ్‌ తుది జట్టు
జోరూట్‌(కెప్టెన్‌), డొమినిక్‌ సిబ్లే, క్రావ్లే, బెయిర్‌ స్టో, బెన్‌ స్టోక్స్‌, ఓలీ పోప్‌, బెన్‌ ఫోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, జాక్‌ లీచ్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌

మరిన్ని వార్తలు