IND Vs IRE- Hardik Pandya: మరీ ఇంత స్వార్థం పనికిరాదు! పాండ్యాపై నెటిజన్ల ఫైర్‌

27 Jun, 2022 10:51 IST|Sakshi
హార్దిక్‌ పాండ్యాపై నెటిజన్ల ట్రోల్స్‌

India vs Ireland T20 Series: ఐర్లాండ్‌ పర్యటనలో ఉన్న భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హార్దిక్‌ పాండ్యాపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. మరీ ఇంత స్వార్థం పనికిరాదు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. కెప్టెన్‌గా ఉన్నపుడు జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించాలని, అంతే తప్ప నేనే అంతా నడిపిస్తున్నా కదా అని విర్రవీగకూడదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. సీనియర్లను చూసి కాస్త నేర్చుకో అంటూ చురకలు అంటిస్తున్నారు.

కాగా రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కై టీమిండియా ఐర్లాండ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డబ్లిన్‌ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌కు వరణుడు ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. ఇక టాస్‌ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ఐర్లాండ్‌ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.

కెప్టెన్‌గా తొలి విజయం.. అయినా
లక్ష్య ఛేదనకు దిగిన పాండ్యా సేన 9.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 111 పరుగులు సాధించింది. తద్వారా ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది 1-0 ఆధిక్యంలో నిలిచింది. 3 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీసిన యజువేంద్ర చహల్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది.

అంతాబాగానే ఉన్నా హార్దిక్‌ పాండ్యాపై అభిమానుల ఆగ్రహానికి కారణం.. అరంగేట్ర ఆటగాడు ఉమ్రాన్‌ మాలిక్‌ పట్ల వ్యవహరించిన విధానం. ఈ మ్యాచ్‌లో స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌తో ఒకే ఒక ఓవర్‌ బౌలింగ్‌ చేయించిన పాండ్యా.. తాను మాత్రం రెండు ఓవర్లు వేశాడు. 

దీంతో.. ఇటీవలి కాలంలో బౌలింగ్‌లో మరీ అంత గొప్ప ప్రదర్శన లేకున్నా నువ్వు మాత్రం రెండు ఓవర్లు వేశావు.. ఉమ్రాన్‌కు మాత్రం ఒకే ఓవర్‌ ఎందుకు ఇచ్చావు అంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కెప్టెన్‌గా ఇలాగేనా వ్యవహరించేది.. ముందు జట్టు గురించి ఆలోచించాలి.. ఆ తర్వాతే నీ గురించి అంటూ చురకలు అంటిస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసిన పాండ్యా 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఉమ్రాన్‌ మాలిక్‌ తన ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చాడు.  కాగా ఐపీఎల్‌-2022లో 14 సార్లూ ‘ఫాస్టెస్ట్‌ బాల్‌’ అవార్డు గెలుచుకున్న ఉమ్రాన్‌ మొత్తంగా 22 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు.

చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌ కెప్టెన్‌ సంచలన నిర్ణయం..!
IND vs IRE: చరిత్ర సృష్టించిన హార్ధిక్‌ పాండ్యా.. తొలి భారత కెప్టెన్‌గా..!

మరిన్ని వార్తలు