Ind Vs Ire: టీమిండియా క్యాప్‌ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్‌: మాజీ పేసర్‌

18 Aug, 2023 15:01 IST|Sakshi

Ireland vs India T20Is 2023: ఇటీవలి కాలంలో యువ క్రికెటర్లలో చాలా మందికి టీమిండియా క్యాప్ తేలికగానే లభిస్తోందని మాజీ పేసర్‌ అతుల్‌ వాసన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగడం మంచిది కాదని.. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. కొత్త వాళ్లను ఆడించే క్రమంలో అర్హులైన ప్లేయర్లను బెంచ్‌కు పరిమితం చేయవద్దని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.

ఐపీఎల్‌ స్టార్లకు అవకాశాలు
కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో నిరూపించుకున్న చాలా మంది యువ క్రికెటర్లు అనతికాలంలో భారత జట్టుకు ఆడే అదృష్టం దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీమిండియా టీ20 జట్టు ఎంపిక సమయంలో వీరికి ప్రాధాన్యం ఉంటోంది. 

ఇటీవల ముగిసిన వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా యశస్వి జైశ్వాల్‌(టెస్టు ద్వారా), ముకేశ్‌ కమార్‌, తిలక్‌ వర్మ అరంగేట్రం చేశారు. ఇక ప్రస్తుతం ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న భారత జట్టులో పంజాబ్‌ కింగ్స్‌ ప్లేయర్‌ జితేశ్‌ శర్మతో పాటు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్టార్‌ రింకూ సింగ్‌ తొలిసారి చోటు దక్కించుకున్నాడు.

ఈజీ అయిపోయింది.. ఇలాగే కొనసాగితే
డబ్లిన్‌ వేదికగా శుక్రవారం మొదలుకానున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నేపథ్యంలో ఐరిష్‌ జట్టుపై వీరిద్దరి అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతుల్‌ వాసన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో ఇండియన్‌ క్యాప్‌ అందుకోవడం ఈజీ అయిపోయింది. మనందరం ఇలాంటి పరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఈ ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే కష్టం.

నా అభిప్రాయం ప్రకారం... ఎంత మందికి అవకాశమిచ్చినా.. ఒక మంచి ఆటగాడిని మాత్రం మిస్‌ చేయకూడదు. ప్రపంచవ్యాప్తంగా టీ10, టీ20, 50- ఓవర్‌ పేరిట ఎన్నో జట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క ఆటగాడికి ఏదో ఒక రూపంలో కచ్చితంగా ఆడే అవకాశం వస్తోంది’’ అని అతుల్‌ ఇండియా.కామ్‌తో చెప్పుకొచ్చాడు.

అదే జరిగితే బుమ్రా అవుట్‌!
ఇక ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తున్న భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి ప్రస్తావిస్తూ.. ‘‘తీవ్రమైన వెన్ను నొప్పి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని బుమ్రా తిరిగి వస్తున్నాడు. ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే అతడి కెరీర్‌ మరికొంత కాలం పొడిగించుకోవచ్చు.  ఒకవేళ గాయం గనుక తిరగబెడితే మాత్రం కష్టం.

తనదైన బౌలింగ్‌ యాక్షన్‌తో బుమ్రా సాధించిన విజయాలు కొనసాగించాలంటే తప్పక పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించాల్సిందే’’ అని అతుల్‌ వాసన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా 55 ఏళ్ల అతుల్‌ వాసన్‌ టీమిండియా తరఫున 4 టెస్టుల్లో 10, 9 వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 18-23 వరకు బుమ్రా సారథ్యంలోని భారత యువ జట్టు ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పోటీ పడనుంది.

చదవండి: అరంగేట్రంలో విఫలం.. కట్‌ చేస్తే.. ప్రపంచ క్రికెట్‌లో రారాజుగా!

మరిన్ని వార్తలు