India Vs Ireland T20: రాహుల్‌ త్రిపాఠిపై రవిశాస్త్రి ప్రశంసలు.. అతడు క్రీజులో ఉంటే చాలు!

25 Jun, 2022 11:28 IST|Sakshi
టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి

India Vs Ireland T20I Series: మహారాష్ట్ర బ్యాటర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠిపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అతడు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు పరిగెడుతూనే ఉంటుందంటూ కొనియాడాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విరుచుకుపడతాంటూ ఆకాశానికెత్తాడు. 

కాలం కలిసి రాలేదు! కానీ ఇప్పుడు..
కాగా ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రాహుల్‌ త్రిపాఠి 14 మ్యాచ్‌లలో కలిపి 413 పరుగులు చేశాడు. సగటు 37.5. స్ట్రైక్‌ రేటు 158.23. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు ఎంపికవుతాడనే విశ్లేషణలు వినిపించినా సెలక్టర్లు అతడికి మొండిచేయి చూపారు.

అయితే, టీమిండియా ఐర్లాండ్‌ పర్యటన రూపంలో రాహుల్‌ త్రిపాఠికి అదృష్టం కలిసి వచ్చింది. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో ఐర్లాండ్‌తో ఆడనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు ఎంపికయ్యాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్‌ తరఫున అరంగేట్రం చేయనున్నాడు.

అతడు క్రీజులో ఉన్నాడంటే చాలు!
ఈ నేపథ్యంలో రవిశాస్త్రి ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘అతడు క్రీజులో ఉంటే స్కోరు బోర్డులో అంకెలు మారుతూనే ఉంటాయి. బంతిని సరిగ్గా అంచనా వేసి షాట్‌ సెలక్షన్‌ విషయంలో పక్కాగా ఉంటాడు. ప్రత్యర్థి జట్టుకు గానీ, బౌలర్లకు గానీ ఏమాత్రం ఛాన్స్‌ ఇవ్వడు. ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి ఇన్నింగ్స్‌ ఆడే విధానం చూడముచ్చటగా ఉంటుంది’’ అని రాహుల్‌ త్రిపాఠిపై ప్రశంసలు కురిపించాడు.

ఇదిలా ఉంటే.. భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా 31 ఏళ్ల రాహుల్‌ త్రిపాఠి.. ‘‘నాకు దక్కిన గొప్ప అవకాశం. ఇన్నాళ్లకు కల నిజమైంది. నా హార్డ్‌వర్క్‌ను గుర్తించి సెలక్టర్లు ఈ ఛాన్స్‌ ఇచ్చారు. తుది జట్టులో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా నా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తాను’’ అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్‌ టీ 20 సిరీస్‌.. ఇరు జట్లు, షెడ్యూల్‌.. పూర్తి వివరాలు!

మరిన్ని వార్తలు