T20 WC 2022: ఆ విషయంలో టీమిండియా ఆటగాళ్ల తీవ్ర అసంతృప్తి?.. కానీ ఐసీసీ మాత్రం అంతే!

26 Oct, 2022 09:22 IST|Sakshi
హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(ఫైల్‌ ఫొటో)

T20 World Cup 2022- India Vs Netherlands: సిడ్నీలో నెట్‌ సెషన్‌ సందర్భంగా తమకు సరైన భోజనం లభించలేదంటూ టీమిండియా ఆటగాళ్లలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రాక్టీస్‌ ముగించుకుని హోటల్‌కు వెళ్లిన తర్వాతే వారు లంచ్‌ చేసినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై విజయంతో భారత జట్టు శుభారంభం చేసిన విషయం తెలిసిందే.

హోటల్‌ చాలా దూరం..!
ఈ క్రమంలో నెదర్లాండ్స్‌తో సిడ్నీ వేదికగా గురువారం తమ తదుపరి మ్యాచ్‌ ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్న రోహిత్‌ సేన మంగళవారం ప్రాక్టీసు సెషన్‌లో పాల్గొంది. కాగా టీమిండియా బస చేసే హోటల్‌కు.. గ్రౌండ్‌కు దాదాపు 42 కిలోమీటర్ల దూరం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంతదూరం నుంచి ప్రాక్టీసుకు వెళ్లిన ఆటగాళ్లకు మధ్యాహ్నం సరైన భోజన వసతి కల్పించడంలో టోర్నీ నిర్వాహకులు(ఐసీసీ) విఫలమైనట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, దినేశ్‌ కార్తిక్‌, రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ తదితరులు నెట్‌ సెషన్‌లో పాల్గొనగా.. ప్రాక్టీస్‌ తర్వాత సరైన భోజనం పెట్టలేదని బీసీసీఐ సన్నిహిత వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ఫుడ్‌ బాగా లేదు!
‘‘ఫుడ్‌ అస్సలు బాగాలేదు. ప్రాక్టీస్‌ తర్వాత కనీసం వేడి వేడి సాండ్‌విచ్‌ కూడా ఇవ్వలేదు. దీంతో కొంతమంది ఆటగాళ్లు హోటల్‌కు వెళ్లిన తర్వాతే భోజనం చేయాలని భావించారు’’ అని భారత జట్టుకు చెందిన ఓ వ్యక్తి పేర్కొన్నట్లు న్యూస్‌ ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. ఇక సిడ్నీలో ఆతిథ్యం  విషయంలో అసంతృప్తితో ఉన్న టీమిండియా ఆటగాళ్లు బీసీసీఐ అధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 

ఐసీసీ అలాగే చేస్తుంది
ఈ నేపథ్యంలో ఆప్షనల్‌ ట్రెయినింగ్‌ సెషన్‌ను కొంతమంది బాయ్‌కాట్‌ చేసినట్లు వార్తలు రాగా.. బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. ‘‘ఎవరూ నెట్‌ సెషన్‌ బాయ్‌కాట్‌ చేయలేదు. కొంతమంది పండ్లు, ఫెలాఫెల్‌(బీన్స్‌తో చేసే డీప్‌ ఫ్రై వంటకం- మధ్యప్రాచ్య దేశాల్లో ఎక్కువగా తింటారు) తిన్నారు.

అయితే, లంచ్‌ హోటల్‌లోనే చేయాలని భావించారు. అసలు సమస్య ఏమిటంటే.. లంచ్‌ తర్వాత ఐసీసీ వేడి వేడి వంటకాలు వడ్డించదు. ద్వైపాక్షిక సిరీస్‌ సమయంలో అయితే.. ఆతిథ్య దేశానికి చెందిన క్యాటరింగ్‌ ఇన్‌చార్జ్‌ ఈ వ్యవహారాలు చూసుకుంటారు. 

ప్రాక్టీస్‌ సెషన్‌ తర్వాత భారతీయ వంటకాలు వడ్డిస్తారు. అయితే, ఐసీసీ మాత్రం అన్ని దేశాల ఆటగాళ్లకు ఒకే రకమైన భోజనం ఇస్తుంది. అవకాడోతో తయారు చేసిన చల్లారిపోయిన సాండ్‌విచ్‌ మాత్రమే కాదు.. టొమాటో, దోసకాయ వంటివి కూడా భోజనంలో ఉంటాయి’’ అని పీటీతో వ్యాఖ్యానించారు. 

చదవండి: WC 2022: పాక్‌తో మ్యాచ్‌లో విఫలం.. అందరి దృష్టి అతడిపైనే! నెట్స్‌లో తీవ్ర సాధన! పసికూనతో అయినా
Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన దిగ్గజ అంపైర్‌

మరిన్ని వార్తలు