Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్‌.. నిప్పులు చెరిగిన లోకల్‌ బాయ్‌.. భావోద్వేగ ట్వీట్‌

19 Jan, 2023 10:17 IST|Sakshi

India vs New Zealand, 1st ODI- Mohammed Siraj: ఉప్పల్‌ స్టేడియంలో పరుగుల ఉప్పెన ఎగిసింది. మధ్యాహ్నం ఎండలో.. సాయంత్రం చలిగాలిలో... రాత్రి చుక్కల ఆకాశంలో... అభిమానులు ప్రతి పరుగునూ, ప్రతి బంతినీ ఆస్వాదించారు. ముందుగా శుబ్‌మన్‌ గిల్‌ పరుగుల వరదకు... అనంతరం ‘లోకల్‌ బాయ్‌’ సిరాజ్‌ నిప్పులు చెరిగే బంతులకు... చివర్లో న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మైకేల్‌ బ్రేస్‌వెల్‌ పోరాట పటిమకు ముగ్ధులయ్యారు.

వెరసీ.. హైదరాబాద్‌లో భారత్, న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. నువ్వా.. నేనా అంటూ చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠ పోరు కొనసాగింది. అభిమానులు వెచ్చించిన ప్రతి పైసాకు ఫుల్‌ వినోదం లభించింది.


మ్యాచ్‌ను వీక్షిస్తున్న సిరాజ్‌ కుటుంబ సభ్యులు 

ఇప్పటి వరకు భాగ్యనగరంలో న్యూజిలాండ్‌తో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌ ఓడిపోలేదు. ఈసారీ అదే ఆనవాయితీని టీమ్‌ ఇండియా కొనసాగించింది. తన అజేయ రికార్డును నిలబెట్టుకుంది.  12 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.

భావోద్వేగ ట్వీట్‌
ఇక ఈ మ్యాచ్‌లో లోకల్‌ బాయ్‌ మహ్మద్‌ సిరాజ్‌ 10 ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసి.. 46 పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు తీశాడు. కాగా రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో సిరాజ్‌కు టీమిండియా తరఫున ఇది తొలి మ్యాచ్‌ అన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విజయానంతరం సిరాజ్‌ భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. ‘‘నా కుటుంబ సభ్యులు, స్నేహితుల కోలాహలం నడుమ సొంతమైదానంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడటం.. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది’’ అని పేర్కొన్నాడు.

ఇక ఉప్పల్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన భారత ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ సహా న్యూజిలాండ్‌ బ్యాటర్‌ బ్రేస్‌వెల్‌ను సిరాజ్‌ ఈ సందర్భంగా అభినందించాడు. వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపాడు.

చదవండి: IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్‌ శర్మ
IND vs NZ: బ్రెస్‌వెల్‌ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా
IND vs NZ: టీమిండియాకు ‘శుబ్‌’ ఘడియలు వచ్చేశాయి..

మరిన్ని వార్తలు