Ind Vs NZ- Uppal: హైదరాబాద్‌లో వన్డే.. టికెట్ల ధరలు, పూర్తి వివరాలు! ఒక్కొక్కరికి ఎన్ని?

12 Jan, 2023 09:44 IST|Sakshi

India Vs New Zealand- 1st ODI- Tickets Details- సాక్షి, హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 22, 2022... భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే టి20 మ్యాచ్‌ టికెట్లు కొనుగోలు చేసేందుకు సికింద్రాబాద్‌ జింఖానా మైదానానికి వచ్చిన అభిమానులు... సరైన ఏర్పాట్లు లేక తోపులాట... పోలీసుల రంగప్రవేశం... ఏడుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు... ఈ ఘటనను క్రికెట్‌ అభిమానులు ఎవరూ మరచిపోలేరు.

గతానుభవం నుంచి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) పాఠం నేర్చుకుంది. ఫ్యాన్స్‌ అడిగారంటూ గత మ్యాచ్‌ సమయంలో ‘ఆఫ్‌లైన్‌’లో కౌంటర్‌ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్ల అమ్మకాలు ప్రారంభించి తీవ్ర రచ్చకు కారణమైన హెచ్‌సీఏ ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా టికెట్ల అమ్మకంపై ముందే స్పష్టతనిచ్చేసింది.

‘ఆన్‌లైన్‌’ ద్వారానే
ఈ నెల 18న ఉప్పల్‌ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే మ్యాచ్‌ జరగనుంది. దీనికి సంబంధించిన మొత్తం టికెట్లన్నీ ‘ఆన్‌లైన్‌’ ద్వారానే అమ్ముతామని... ‘పేటీఎం’ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌ వెల్లడించారు.

హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్, పర్యవేక్షణ కమిటీ సభ్యుడు వంకా ప్రతాప్‌తో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. 2019 మార్చి 2న భారత్, ఆస్ట్రేలియా తలపడిన తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న వన్డే మ్యాచ్‌ ఇదే. కలెక్షన్‌ పాయింట్‌ల వద్ద కూడా ఎలాంటి గందరగోళం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అజహర్‌ చెప్పారు.  

టికెట్ల అమ్మకాల వివరాలు  
మ్యాచ్‌ తేదీ: జనవరి 18, 
మధ్యాహ్నం గం.1:30 నుంచి  
అందుబాటులో ఉన్న టికెట్లు: 29,417 

టికెట్ల ధరలు (కార్పొరేట్‌ బాక్స్‌ టికెట్‌ సహా): రూ. 850, రూ.1000, రూ. 1250, రూ. 1500, రూ. 2,500, రూ. 5,000, రూ.7,500, రూ.9,000, రూ.10,000, రూ. 17,700, 
రూ. 20,650.
 
అమ్మకాల తేదీలు: జనవరి 13, 14, 15, 16 (ప్రతి రోజూ సా. 5 గంటల నుంచి)... 
తొలి రోజు 6 వేలు, రెండో రోజు 7 వేలు, మూడో రోజు 7 వేలు, నాలుగో రోజు మిగిలిన టికెట్లు అందుబాటులో ఉంటాయి. 

 
ఎక్కడ: ‘పేటీఎం’ వెబ్‌సైట్‌లో :
ఒక్కొక్కరు గరిష్టంగా 4 టికెట్లే కొనవచ్చు

ఫిజికల్‌ టికెట్‌ కోసం..
ఆన్‌లైన్‌లో టికెట్‌ కొనుగోలు చేసే సమయంలోనే దానిని మార్చుకునే ‘కలెక్షన్‌ పాయింట్‌’ను ఎంచుకోవాలి. క్యూఆర్‌ కోడ్‌ చూపిస్తే అక్కడ ‘ఫిజికల్‌ టికెట్‌’ ఇస్తారు. ఇది ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తారు. మార్చుకునే సమయంలో ఏదైనా గుర్తింపు పత్రం (ఐడీ కార్డు) తప్పనిసరి.  

కలెక్షన్‌ పాయింట్‌లు 
ఎల్బీ స్టేడియం, జీఎంసీ బాలయోగి స్టేడియం–గచ్చిబౌలి (జనవరి 15 నుంచి ఉదయం. గం. 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య)

చదవండి: PAK VS NZ 2nd ODI: కాన్వే సూపర్‌ సెంచరీ.. పాక్‌ను మట్టికరిపించిన న్యూజిలాండ్‌  

మరిన్ని వార్తలు