-

IND VS NZ 1st ODI: టీమిండియా చెత్త రికార్డు.. చరిత్రలో తొలిసారి ఇలా..!

25 Nov, 2022 16:31 IST|Sakshi

ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్‌ 25) జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న టీమిండియా.. ఓ చెత్త రికార్డును సైతం ఖాతాలో వేసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్‌ గడ్డపై వరుసగా 4 వన్డే మ్యాచ్‌ల్లో ఓడి అభాసుపాలైంది. 2020లో జరిగిన సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయిన భారత జట్టు.. తాజా పరాజాయంతో కివీస్‌ గడ్డపై వరుసగా నాలుగో పరాజయాన్ని నమోదు చేసింది. 

గత పర్యటనలో తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో, రెండో వన్డేలో 22 పరుగుల తేడాతో, మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిన భారత్‌.. 2022 పర్యటనలో భాగంగా ఇవాళ జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. న్యూజిలాండ్‌ గడ్డపై వన్డేల్లో చెత్త రికార్డు (25 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ గెలిస్తే.. టీమిండియా 14 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది) కలిగిన భారత్‌.. తాజా పరాజయంతో మరో అప్రతిష్టను మూటగట్టుకుంది. అయితే ఓవరాల్‌ హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్‌లో మాత్రం టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 106 మ్యాచ్‌లు జరగ్గా టీమిండియా 55, న్యూజిలాండ్‌ 50 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. 

ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. శ్రేయస్‌ అయ్యర్‌ (80), శిఖర్‌ ధవన్‌ (72), శుభ్‌మన్‌ గిల్‌ (50) అర్ధసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేయగా, 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ మరో 17 బంతులు మిగిలుండగానే ఆడుతూపాడుతూ విజయం సాధించింది. టామ్‌ లాథమ్‌ (104 బంతుల్లో 145; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ శతకంతో, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (98 బంతుల్లో 94 నాటౌట్‌; 7 ఫోర్లు, సిక్స్‌) భారీ అర్ధశతకంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.  

మరిన్ని వార్తలు