Ind Vs NZ: రాంచిలో మ్యాచ్‌ అంటే అంతే!

27 Jan, 2023 09:54 IST|Sakshi

India vs New Zealand, 1st T20I: వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా టీ20 సిరీస్‌పై కన్నేసింది. వన్డేల్లో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో పొట్టి క్రికెట్‌లో పోటీకి సిద్ధమైంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో కివీస్‌తో పోరుకు సై అంటోంది.

మరోవైపు.. వన్డే సిరీస్‌లో ఘోర పరాజయంతో డీలా పడిన న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లోనైనా సత్తా చాటి తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. మిచెల్‌ సాంట్నర్‌ నేతృత్వంలో కివీస్‌ జట్టు బరిలోకి దిగనుంది.  కాగా సారథిగా సాంట్నర్‌ ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌ వంటి చిన్న జట్లపై కివీస్‌కు విజయాలు అందించాడు. ఈ క్రమంలో రాంచి వేదికగా శుక్రవారం నాటి తొలి మ్యాచ్‌తో టీమిండియా- కివీస్‌ మధ్య ఆరంభం కానున్న టీ20 సిరీస్‌ ఆసక్తికరంగా మారింది.

రాంచీ మ్యాచ్‌ అంటే అంతే!
ఇక రాంచీలో మ్యాచ్‌ అంటే ఆడినా, ఆడకపోయినా మహేంద్ర సింగ్‌ ధోని ఉండాల్సిందే! తన రిటైర్మెంట్‌ తర్వాతి నుంచి ఎప్పుడు నగరంలో టీమిండియా ఆడినా వారిని కలిసే ధోని ఈసారి కూడా దానిని కొనసాగించాడు.

మ్యాచ్‌ జరిగే జేఎస్‌సీఏ స్టేడియానికి వచ్చి పాండ్యా బృందంతో మిస్టర్‌ కూల్‌ ముచ్చటించాడు. జార్ఖండ్‌ టీమ్‌ డ్రెస్‌లో అప్పటి వరకు ప్రాక్టీస్‌ సాగించిన ఈ మాజీ కెప్టెన్‌.. డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చి ఆటగాళ్లతో విభిన్న అంశాలపై మాట్లాడాడు. అతనితో కలిసి ఆడిన, ఆడని కొత్త ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కూడా ధోనిని కలిసినందుకు ఆనందంతో పొంగిపోయారు. 

ఇండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ మొదటి టీ20
పిచ్, వాతావరణం 
బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే సాధారణ వికెట్‌. ఛేదనలోనే అన్ని జట్లకు మెరుగైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 3 అంతర్జాతీయ టి20ల్లోనూ భారత్‌ గెలిచింది. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు. మంచు ప్రభావం ఎక్కువ కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకోవడం ఖాయమని చెప్పవచ్చు.

ముఖాముఖి పోరు
కాగా 2021 నవంబర్‌లో భారత్‌లో ఆడిన టి20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ 0–3తో చిత్తయింది.  

తుది జట్ల వివరాలు (అంచనా)  
టీమిండియా:
శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా(కెప్టెన్‌), దీపక్‌ హుడా, వాషింగ్టన్‌ సుందర్‌, శివం మావి, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, యజువేంద్ర చహల్‌

న్యూజిలాండ్‌
ఫిన్‌ అలెన్‌, డెవాన్‌ కాన్వే(వికెట్‌ కీపర్‌), మార్క్‌ చాప్‌మన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, డారిల్‌ మిచెల్‌, మైకేల్‌ బ్రాస్‌వెల్‌, మిచెల్‌ సాంట్నర్‌(కెప్టెన్‌), లాకీ ఫెర్గూసన్‌, ఇష్‌ సోధి, బ్లెయిర్‌ టిక్నర్‌, బెన్‌ లిస్టర్‌/జాకోబ్‌ డఫీ.

చదవండి: Ravindra Jadeja: రీ ఎంట్రీలో దుమ్మురేపిన జడేజా.. ఏకంగా 8 వికెట్లతో..!
ICC Awards 2022: ఐసీసీ అవార్డు విన్నర్ల మొత్తం జాబితా ఇదే..

మరిన్ని వార్తలు