Ind Vs Nz Test- Srikar Bharat: ఆ క్యాచ్‌ నిజంగా సూపర్‌.. ఒకవేళ భరత్‌ పట్టుబట్టకపోయి ఉంటేనా!

28 Nov, 2021 07:51 IST|Sakshi
PC: Disney+ Hotstar

శ్రీకారానికి సమయం...

సబ్‌స్టిట్యూట్‌ కీపర్‌గా ఆకట్టుకున్న భరత్‌

Ind Vs Nz 1st Test: Srikar Bharat Utilizes Most Of His Surprise Opportunity: 78 మ్యాచ్‌లు... 9 సెంచరీలు, 23 హాఫ్‌ సెంచరీలు సహా 4,283 పరుగులు... అందులో ఒక ట్రిపుల్‌ సెంచరీ కూడా... కీపర్‌గా 270 క్యాచ్‌లు... 28 ఏళ్ల కోన శ్రీకర్‌ భరత్‌ ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ ఇది... టెస్టుల్లో అవకాశం అందుకునేందుకు ఈ ప్రదర్శన చాలు. చాలా రోజులుగా సీనియర్‌ టీమ్‌ తరఫున ఆడేందుకు ఎదురు చూస్తున్న భరత్‌ సమయం ఇప్పుడు వచ్చిందా!  

అత్యుత్తమ వికెట్‌ కీపింగ్‌ ప్రతిభతో పాటు బ్యాటింగ్‌లో కూడా పదును ఉన్న భరత్‌ భారత్‌ ‘ఎ’ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌లకు చెందిన ‘ఎ’ జట్లపై అతను సత్తా చాటుతూ వచ్చాడు. గత కొన్ని సిరీస్‌లలో అదనపు ఆటగాడిగా భారత సీనియర్‌ టీమ్‌తో ఉంటూ వచ్చిన భరత్‌ తొలిసారి టెస్టు టీమ్‌లోకి ఎంపికయ్యాడు. కాన్పూర్‌ మ్యాచ్‌లో తుది జట్టులోకి ఎంపిక కాకపోయినా, అనూహ్యంగా వచ్చిన అవకాశంతో ఇప్పుడు ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు.

కొద్ది రోజుల క్రితం ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఢిల్లీపై చివరి బంతికి సిక్సర్‌ కొట్టి ఎవరీ భరత్‌... అనిపించుకున్న ఈ ఆంధ్ర ఆటగాడు తాను టెస్టుల కు ఎలా సరిపోతానో శనివారం చూపించాడు. మెడ పట్టేయడంతో వృద్ధిమాన్‌ సాహా మూడో రోజు ఆటకు దూరం కాగా, భరత్‌ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అనూహ్య బౌన్స్‌ ఉన్న ఈ పిచ్‌పై అశ్విన్‌ బంతులు అర్థం చేసుకోవడమే కష్టం. అలాంటిది యంగ్‌ క్యాచ్‌ను అతను అందుకున్న తీరు నిజంగా సూపర్‌. బ్యాట్‌కు తగిలి బాగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని మోకాలిపై కూర్చొని భరత్‌ పట్టేశాడు. అంపైర్‌ అవుట్‌ ఇవ్వకపోయినా, తన క్యాచ్‌పై గట్టి నమ్మకంతో రహానేను రివ్యూకు ఒప్పించి అతను ఫలితం సాధించగలిగాడు.

ఆ తర్వాత టేలర్‌ క్యాచ్, లాథమ్‌ను స్టంపౌంట్‌ చేసిన తీరు ప్రశంసార్హం. 37 ఏళ్ల వయసులో తరచూ గాయాలపాలవుతున్న సాహా 2017లో సాధించిన అర్ధ సెంచరీ తర్వాత 14 ఇన్నింగ్స్‌లలో 29 అత్యధిక స్కోరుతో 156 పరుగులే చేయగలిగాడు. బెస్ట్‌ కీపర్‌ అయినా అతని పేలవ బ్యాటింగ్‌ జట్టును ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి స్థితిలో సెలక్టర్లు మార్పు కోరుకుంటే భరత్‌కు అవకాశం దక్కుతుంది. ముంబైలో జరిగే రెండో టెస్టులోగా సాహా కోలుకోకపోతే భరత్‌ టెస్టు కెరీర్‌ శ్రీకారం చుట్టడం ఖాయం! 

చదవండి: Axar Patel: వారెవ్వా అక్షర్‌ పటేల్‌.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో మూడో బౌలర్‌గా

మరిన్ని వార్తలు