Ind Vs Nz 2021 1st Test: విలియమ్సన్‌ విఫలం.. ఆట మార్చిన అక్షర్‌ ‘ఐదు’

28 Nov, 2021 07:22 IST|Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 296 ఆలౌట్‌

భారత్‌కు 49 పరుగుల ఆధిక్యం

అక్షర్‌ పటేల్‌కు 5 వికెట్లు ∙రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 14/1

Ind Vs Nz 2021 1st Test: India Dominated End Day 3 Axar 5 Wicket Haul: తొలి టెస్టులో రెండో రోజు చేజారిన పట్టును మూడో రోజుకు వచ్చేసరికి భారత్‌ చేజిక్కించుకుంది. శుక్రవారం ఒక్క న్యూజిలాండ్‌ వికెట్‌ కూడా తీయలేకపోయిన భారత బౌలర్లు శనివారం ఒకే రోజు పది వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యం తర్వాత గిల్‌ వికెట్‌ చేజార్చుకున్నా... నాలుగో రోజు మంచి స్కోరు సాధించి కివీస్‌కు సవాల్‌ విసిరే అవకాశం టీమిండియా ముందుంది. కెరీర్‌ నాలుగో టెస్టులోనే ఐదు వికెట్ల ఘనతను ఐదో సారి నమోదు చేసిన అక్షర్‌ పటేల్‌ బౌలింగే మూడో రోజు ఆటలో హైలైట్‌.

కాన్పూర్‌: భారీ స్కోరు దిశగా సాగిపోతున్న న్యూజిలాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో రహానే బృందం కట్టడి చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 129/0తో ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌ 296 పరుగులకే ఆలౌటైంది. లాథమ్‌ (95; 10 ఫోర్లు), విల్‌ యంగ్‌ (89; 15 ఫోర్లు) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. అక్షర్‌ పటేల్‌ (5/62)తోపాటు అశ్విన్‌ (3/82) ప్రత్యర్థిని పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ రెండో ఓవర్‌ తొలి బంతికే గిల్‌ (1) వికెట్‌ కోల్పోయింది. మయాంక్‌ (4 బ్యా టింగ్‌),  పుజారా (9 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.  

విలియమ్సన్‌ విఫలం... 
కివీస్‌ ఓపెనర్లు లాథమ్, యంగ్‌ రెండో రోజు కూడా తడబాటు లేకుండా ఆడారు. అయితే తొలి వికెట్‌ తీసేందుకు భారత్‌ చేస్తూ వచ్చిన ప్రయత్నం ఎట్టకేలకు శనివారం వేసిన పదో ఓవర్లో ఫలించింది. అశ్విన్‌ బంతిని ఆడబోయిన యంగ్‌... సబ్‌స్టిట్యూట్‌ కీపర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కివీస్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. లంచ్‌కు ముందు చివరి ఓవర్లో కెప్టెన్‌ విలియమ్సన్‌ (18)ను ఉమేశ్‌ అవుట్‌ చేశాడు. విరామం తర్వాత భారత్‌ మరింత పట్టు బిగించింది.

ఈ సెషన్‌లో అక్షర్‌ చెలరేగిపోయాడు. తన 11 ఓవర్ల స్పెల్‌లో అతను 14 పరుగులు మాత్రమే ఇచ్చి టేలర్, నికోల్స్, లాథమ్‌ వికెట్లు పడగొట్టాడు. అనంతరం రచన్‌(13)ను జడేజా బౌల్డ్‌ చేయడంతో టీ సమయానికి కివీస్‌ స్కోరు 249/6కు చేరింది. చివరి సెషన్‌లో జేమీసన్‌ (23) ప్రతిఘటించడంతో కివీస్‌ స్కోరులో మరికొన్ని పరుగులు చేరాయి. సౌతీ (5)ని బౌల్డ్‌ చేసిన అక్షర్‌ ఐదు వికెట్ల ఘనతను పూర్తి చేసుకోగా ... చివరి రెండు వికెట్లు అశ్విన్‌ ఖాతాలో చేరాయి. ఒక దశలో 197/1తో పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్‌ 99 పరుగులకే మిగిలిన 9 వికెట్లు కోల్పోయింది. 

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 345;
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (స్టంప్డ్‌) (సబ్‌) భరత్‌ (బి) అక్షర్‌ 95; యంగ్‌ (సి) (సబ్‌) భరత్‌ (బి) అశ్విన్‌ 89; విలియమ్సన్‌ (ఎల్బీ) (బి) ఉమేశ్‌ 18; రాస్‌ టేలర్‌ (సి) (సబ్‌) భరత్‌ (బి) అక్షర్‌ 11; నికోల్స్‌ (ఎల్బీ) (బి) అక్షర్‌ 2; బ్లన్‌డెల్‌ (బి) అక్షర్‌ 13; రచిన్‌ రవీంద్ర (బి) జడేజా 13; జేమీసన్‌ (సి) అక్షర్‌ (బి) అశ్విన్‌ 23; సౌతీ (బి) అక్షర్‌ 5; సోమర్‌విలే (బి) అశ్విన్‌ 6; ఎజాజ్‌ పటేల్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (142.3 ఓవర్లలో ఆలౌట్‌) 296.

వికెట్ల పతనం: 1–151, 2–197, 3–214, 4–218, 5–227, 6–241, 7–258, 8–270, 9–284, 10–296. బౌలింగ్‌: ఇషాంత్‌ 15–5–35–0, ఉమేశ్‌ 18–3–50–1, అశ్విన్‌ 42.3–10–82–3, జడేజా 33–10–57–1, అక్షర్‌ 34–6–62–5. 

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: మయాంక్‌ (బ్యాటింగ్‌) 4; గిల్‌ (బి) జేమీసన్‌ 1; పుజారా (బ్యాటింగ్‌) 9; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 14. వికెట్ల పతనం: 1–2. బౌలింగ్‌: సౌతీ 2–1–2–0, జేమీసన్‌ 2–0–8–1, ఎజాజ్‌ పటేల్‌ 1–0–4–0.

చదవండి: Krunal Pandya: కృనాల్‌ పాండ్యా కీలక నిర్ణయం... తప్పుకొంటున్నా.. అయితే..

మరిన్ని వార్తలు