-

Suryakumar Yadav: కోహ్లి నాకోసం త్యాగం చేశాడు... అయినా ఏ స్థానంలో వచ్చినా

18 Nov, 2021 09:09 IST|Sakshi

IND Vs NZ 1st T20 2021: Suryakumar Yadav Hails Virat Kohli: న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌ను ఘన విజయంతో ఆరంభించింది టీమిండియా. టీ20 వరల్డ్‌కప్‌ రన్నరప్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి శుభారంభం చేసింది. ఈ విజయంలో సూర్యకుమార్‌ యాదవ్‌ ముఖ్య పాత్ర పోషించాడు. మూడో స్థానంలో మైదానంలో దిగిన అతడు 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన సూర్యకుమార్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. 

నా కోసం త్యాగం చేశాడు..
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. టీ20 మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. అరంగేట్ర మ్యాచ్‌లో తన కోసం నంబర్‌ 3 స్థానాన్ని త్యాగం చేశాడని, ఆ విషయం ఇప్పటికీ తనకు గుర్తుందన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌  2021  టోర్నీలో ఆఖరిదైన నమీబియాతో మ్యాచ్‌లో తనను వన్‌డౌన్‌లో పంపించడంపై స్పందిస్తూ.. ‘‘మెగా టోర్నీలో నాదైన మార్కు చూపాలనుకున్నాను. కానీ వెన్ను నొప్పి కారణంగా.. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆడలేకపోయాను. నిరాశకు లోనయ్యాను. అయితే, చివరి మ్యాచ్‌లో కోహ్లి నన్ను మూడో స్థానంలో పంపించాడు’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ చెప్పుకొచ్చాడు.

అదే విధంగా... ‘‘నా అరంగేట్ర మ్యాచ్‌లో కోహ్లి నాకోసం తన మూడో స్థానాన్ని త్యాగం చేసిన విషయం ఇంకా గుర్తుంది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అచ్చం అలాగే... వరల్డ్‌కప్‌ సమయంలోనూ... నన్ను మూడో స్థానంలో బరిలోకి దించాడు. అలా తిరిగి జట్టులోకి రావడం.. ఆ మ్యాచ్‌లో అజేయంగా నిలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. తను నా పట్ల వ్యవహరించిన తీరు ఎన్నటికీ మర్చిపోను’’ అని గత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.

ఇక ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేసినా తనకు ఇబ్బంది లేదన్న సూర్యకుమార్‌ యాదవ్‌... ‘‘నా ఫ్రాంఛైజీ(ముంబై ఇండియన్స్‌) కోసం గత మూడేళ్లుగా ఎల్లప్పుడూ మూడో స్థానంలో ఆడుతున్నా. అయితే, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నా స్థానం ఏదైనా ఫర్వాలేదు. పెద్ద తేడా ఏమీ ఉండదు. నెట్స్‌లో నాదైన శైలిలో షాట్లు ఆడతాను. ఆటను పూర్తిగా ఆస్వాదిస్తాను. ఎక్కడైనా నా వ్యవహారశైలి ఇలాగే ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో కోహ్లితో పాటు పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: Ind Vs NZ 1st T20- Mark Chapman: మార్క్‌ చాప్‌మన్‌ అరుదైన రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా
Ind Vs Nz 2021: ‘బ్యాటర్‌’గా విరాట్‌ కోహ్లి... టీ20 కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఏమన్నాడంటే!

మరిన్ని వార్తలు