Ravichandran Ashwin: ఫైనల్‌ తర్వాత ఇప్పుడే మళ్లీ.. అశ్విన్‌ ముంగిట అరుదైన రికార్డులు!

24 Nov, 2021 12:08 IST|Sakshi

IND vs NZ 2021 Test Series: 3 Milestones Ravichandran Ashwin Can Achieve in Test Cricket: ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిసిన తర్వాత తొలిసారిగా వైట్‌ జెర్సీలో కనిపించబోతున్నాడు టీమిండియా స్టార్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో చివరి టెస్టు ఆడిన అశూ.. మళ్లీ కివీస్‌తో సిరీస్‌లోనే ఆడనుండటం విశేషం. కాగా కివీస్‌ జట్టుపై అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు అతడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లలో 52 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తుదిజట్టులో అశ్విన్‌కు స్థానం ఖాయమన్న విశ్లేషణల నేపథ్యంలో.. అతడి ముంగిట ఉన్న అరుదైన రికార్డులను ఓ సారి పరిశీలిద్దాం.

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ను అవుట్‌ చేస్తే!
ఇప్పటి వరకు ఆడిన ముఖాముఖి మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను ఐదుసార్లు అవుట్‌ చేశాడు అశ్విన్‌. ఈసారి కూడా అతడిని పెవిలియన్‌కు పంపిస్తే.. మాజీ బౌలర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా రికార్డును అతడు అధిగమిస్తాడు. 

నాలుగు వికెట్లు తీశాడంటే!
ఇప్పటి వరకు 79 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌ 413 వికెట్లు పడగొట్టాడు. ఇక న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా... మరో నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నట్లయితే... హర్భజన్‌ సింగ్‌ రికార్డును అశూ దాటేస్తాడు. కాగా భజ్జీ టెస్టుల్లో 417 వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఈ జాబితాలో అనిల్‌ కుంబ్లే(619), కపిల్‌ దేవ్‌(434) వికెట్లు తమ ఖాతాలో వేసుకుని టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు.

మరొక్కసారి...
ఒక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ల జాబితాలో టీమిండియా మాజీ సారథి అనిల్‌ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. తన కెరీర్‌లో ఎనిమిది సార్లు ఈ ఘనత సాధించాడు. ఇక జాబితాలో అశ్విన్‌ రెండోస్థానం(7 సార్లు)లో కొనసాగుతున్నాడు. ఒకవేళ తొలి టెస్టులోనే అశ్విన్‌ పది వికెట్లు తీసినట్లయితే.. కుంబ్లే రికార్డును అతడు సమం చేస్తాడు.

చదవండి: Ravichandran Ashwin: నాతో పాటు అతడిని కూడా ఢిల్లీ ఫ్రాంఛైజీ రీటైన్‌ చేసుకోదు.. ఎందుకంటే!

మరిన్ని వార్తలు