కివీస్‌తో సిరీస్‌ నుంచి అవుట్‌! డీకే కెరీర్‌ ముగిసిపోయినట్లేనా? అతడిని ఎందుకు ఎంపిక చేయలేదంటే!

1 Nov, 2022 14:09 IST|Sakshi

IND Tour Of NZ 2022టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత న్యూజిలాండ్‌లో పర్యటించనున్న భారత జట్టులో వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌కు చోటు దక్కలేదు. రెగ్యులర్‌ కెప్టెన్‌ గైర్హాజరీ నేపథ్యంలో టీ20 సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యా, వన్డే సిరీస్‌కు శిఖర్‌ ధావన్‌ సారథ్యం వహించనుండగా.. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

అంతేకాదు మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఫినిషర్‌గా జట్టులోకి వచ్చిన దినేశ్‌ కార్తిక్‌ను కావాలనే పక్కకుపెట్టారా? 37 ఏళ్ల డీకే కెరీర్‌ ఇక ముగిసిపోయినట్లేనా అన్న సందేహాల నడుమ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ చేతన్‌ శర్మ స్పందించారు. 

దినేశ్‌ కార్తిక్‌పై ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇతర ఆటగాళ్లకు కూడా అవకాశం ఇచ్చి బెంచ్‌ స్ట్రెంత్‌ను పెంచుకోవాలనే ఉద్దేశంతోనే అతడిని ఎంపిక చేయలేదన్నాడు. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ముగిసిన వెంటనే ఈ టూర్‌ మొదలవుతుంది కాబట్టి డీకేకు విశ్రాంతినివ్వాలని నిర్ణయించినట్లు తెలిపాడు. 

దారులు మూసుకోలేదు..
ఈ మేరకు చేతన్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ముగిసిన ఐదు రోజుల తర్వాత టీ20 సిరీస్‌ ఆరంభమవుతుంది. ఈ టోర్నీలో ఆడిన కొంతమందికి రెస్ట్‌ ఇవ్వాలని భావించాం. దినేశ్‌ కార్తిక్‌ జట్టులో ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

సెలక్టర్లకు అతనెప్పుడూ అందుబాటులో ఉంటాడు. అయితే, మిగతా ఆటగాళ్లతో ప్రయోగం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. ముఖ్యంగా తనకు ఇప్పుడు విశ్రాంతి అవసరం.

దినేశ్‌ కార్తిక్‌ లాంటి అద్భుతమైన ఆటగాడికి ద్వారాలు ఎప్పుడూ తెరచుకునే ఉంటాయి. భవిష్యత్తులో కూడా అతడికి అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ విషయం గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా డీకే వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. కాగా ఐపీఎల్‌-2022లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన డీకే.. జట్టులో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే.

చదవండి: ఇండియా వరల్డ్‌కప్‌ గెలిచేందుకు వచ్చింది.. మేము వారిని ఓడించేందుకే వచ్చాం..!
VVS Laxman: డాక్టర్‌ కాబోయి క్రికెటర్‌! ఆసీస్‌ అంటే ఆకాశమే హద్దు.. ఆ హీరోచిత ఇన్నింగ్స్‌ చిరస్మరణీయం!

మరిన్ని వార్తలు