Mithali Raj: క్రికెట్‌ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డు​.. అరంగేట్రం తర్వాత పుట్టిన క్రికెటర్‌తో..!

15 Feb, 2022 21:46 IST|Sakshi

IND VS NZ 2nd ODI: భారత్‌-న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య క్వీన్స్‌టౌన్‌ వేదికగా జరిగిన రెండో వన్డే సందర్భంగా క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డు ఆవిష్కృతమైంది. మహిళల క్రికెట్‌లోనే కాకుండా పురుషుల క్రికెట్‌లోనూ ఎవ్వరికీ సాధ్యం కాని అత్యంత రేర్ ఫీట్‌ను భారత మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్ సాధించింది. ఈ మ్యాచ్‌లో అజేయమైన అర్ధ శతకంతో(81 బంతుల్లో 66 నాటౌట్‌, 3 ఫోర్లు) రాణించిన మిథాళీ..  ​​​తన కంటే 21 ఏళ్ల చిన్నదైన, తన అంతర్జాతీయ ఆరంగ్రేటం తర్వాత నాలుగేళ్లకు పుట్టిన రిచా ఘోష్‌ (64 బంతుల్లో 65, 6 ఫోర్లు, ఒక సిక్స్‌)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో కనీవిని ఎరుగని రికార్డును తన పేరిట లిఖించుకుంది. 


మిథాలీ రాజ్ 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగ్రేటం చేయగా, రిచా ఘోష్ 2003లో జన్మించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ మిథాలీ రాజ్ ఖాతాలో పలు రికార్డులు వచ్చి చేరాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్ల కెరీర్‌ పూర్తి చేసుకున్న మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా, వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక హాఫ్ సెంచరీలు(7) నమోదు చేసిన భారత కెప్టెన్‌గా, వన్డేల్లో న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు(739) చేసిన టీమిండియా సారధిగా మిథాళీ పలు రికార్డులు నెలకొల్పింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్లు ధోని, కోహ్లిల రికార్డులను సైతం బద్దలు కొట్టింది. 


ఇదిలా ఉంటే, న్యూజిలాండ్ పర్యటనలో భారత మహిళల జట్టు వరుసగా రెండో వన్డేలోనూ ఓడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేయగా, న్యూజిలాండ్‌ వుమెన్స్‌ జట్టు 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అమిలియా కెర్‌(135 బంతుల్లో 119 నాటౌట్‌, 7 ఫోర్లు) అద్బుత సెంచరీతో కడదాకా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. టీమిండియాలో కెప్టెన్‌ మిథాలీరాజ్‌, రిచా ఘోష్‌ అర్ధ సెంచరీలతో చెలరేగగా, ఓపెనర్‌ సబ్బినేని మేఘన 50 బంతుల్లో 7 ఫోర్లతో 49 పరుగులు చేసి ఆకట్టుకుంది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో మూడో వన్డే ఫిబ్రవరి 18న జరగనుంది. 

>
మరిన్ని వార్తలు