Hardik Pandya: ఇదేం పిచ్‌.. షాక్‌కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు.. క్యూరేటర్లు ఇకనైనా..

30 Jan, 2023 11:43 IST|Sakshi
లక్నో పిచ్‌పై హార్దిక్‌ కామెంట్లు (PC: BCCI)

India vs New Zealand, 2nd T20I- Hardik Pandya:  ‘‘మేము మ్యాచ్‌ గెలుస్తామని నమ్మకం ఉంది. అయితే, ముగింపు కాస్త ఆలస్యమైందంతే! పొట్టి క్రికెట్‌లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ప్రతి విషయానికి భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఒత్తిడిని అధిగమిస్తూ పరిస్థితికి తగ్గట్లు స్ట్రైక్‌ రొటేట్‌ చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈరోజు మ్యాచ్‌లో మేము అదే చేశాం’’ అని టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా అన్నాడు.

ఏమాత్రం తేడా వచ్చినా
న్యూజిలాండ్‌తో లక్నోలో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే, 99 పరుగులకే కివీస్‌ను కట్టడి చేసినప్పటికీ గెలుపు కోసం భారత్‌ ఆఖరి బంతి వరకు పోరాడక తప్పలేదు. 


PC: BCCI

పటిష్ట టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌నకు 100 పరుగులు సులువైన లక్ష్యంలాగే అనిపించినా... కివీస్‌ అసాధారణ పోరాటం అభిమానులను భయపెట్టింది. టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(26), సారథి హార్దిక్‌ పాండ్యా(15)తో కలిసి ఆఖరి వరకు పట్టుదలగా నిలబడి గెలిపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


PC: BCCI

టీ20 కోసం తయారు చేసింది కాదు
ఈ నేపథ్యంలో లక్నో పిచ్‌పై టీమిండియా కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘నిజం చెప్పాలంటే ఈ వికెట్‌ మమ్మల్ని విస్మయానికి గురిచేసింది. ఇక్కడ ఇప్పటి వరకు మేము రెండు మ్యాచ్‌లు ఆడాము.

వికెట్‌ మరీ అంత ఇబ్బందిపెట్టేదిగా అనిపించలేదు. కానీ.. ఈ పిచ్‌ అయితే టీ20లకు సరిపోయేది కాదు. పొట్టి క్రికెట్‌ కోసం తయారుచేసింది కాదు. కనీసం 120 పరుగుల స్కోరు కూడా నమోదు కాలేదు. మ్యాచ్‌కు ముందే క్యూరేటర్లు సరైన పిచ్‌లను రూపొందించేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది’’ అంటూ పాండ్యా విమర్శనాస్త్రాలు సంధించాడు.

ఏదేమైనా మ్యాచ్‌ ఫలితం పట్ల సంతోషంగా ఉన్నానని.. పిచ్‌ మాత్రం షాక్‌కు గురిచేసిందని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే... టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య సిరీస్‌ విజేతను తేల్చే మూడో టీ20 ఫిబ్రవరి 1న అహ్మదాబాద్‌లో జరుగనుంది.

చదవండి: T20 WC: 2005 వరల్డ్‌కప్‌ టైమ్‌లో పుట్టినోళ్లు! ఒక్కొక్కరిది ఒక్కో కథ.. కుల్దీప్‌ కోచ్‌ దత్తత తీసుకున్న ఆ అమ్మాయి..
ENG vs SA 2nd ODI: ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం.. సిరీస్‌ సొంతం
 

మరిన్ని వార్తలు